మార్కెట్లోకి మరో కొత్త రకం నోట్లు!

9 Dec, 2016 15:59 IST|Sakshi
మార్కెట్లోకి మరో కొత్త రకం నోట్లు!
పాతనోట్ల రద్దు అనంతరం ఆర్బీఐచే కొత్త కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న కేంద్రప్రభుత్వం మరో కీలకప్రకటన చేసింది. పేపర్ కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రింట్ చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. దానికి అవసరమైన మెటీరియల్ సేకరణను కూడా ప్రారంభించినట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభకు లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. రిజర్వు బ్యాంకు ఎప్పటినుంచో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రింట్ చేయాలని ప్లాన్ చేస్తుందని, దీనికోసం క్షేత్రస్థాయి పరిశీలన  కూడా చేపట్టినట్టు అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. 2014 పిబ్రవరిలోనే ప్రభుత్వం ఈ విషయాన్ని పార్లమెంట్కు వెల్లడించింది. రూ.10 విలువ కలిగిన 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టనున్నట్టు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఐదు రాష్ట్రాలను కూడా ఎంపికచేసినట్టు పార్లమెంట్కు ప్రభుత్వం నివేదించిన సంగతి తెలిసిందే.
 
ప్రభుత్వం ఎంపికచేసిన ప్రాంతాలు కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్లు. పేపర్ కరెన్సీ పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు ఎంతో సురక్షితమైనవి, కనీసం వీటి జీవిత కాలం ఐదేళ్లవరకు ఉంటుంది. వాటిని నకిలీగా ప్రింట్ చేయడానికి ఎటువంటి వీలుండదు. మార్కెట్లో నకిలీ కరెన్సీ నోట్లు పెరిగిపోతుండటంతో ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ, ప్రభుత్వం దృష్టిసారించింది. నకిలీలకు వ్యతిరేకంగా ఈ పేపర్ కరెన్సీని మొదట ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు. ఎలాంటి సెక్యురిటీ ఫీచర్లు లేని కొన్ని రూ.1000 నోట్లు ఆర్బీఐ తన వద్దకు వచ్చినట్టు 2015 డిసెంబర్లో తెలిపినట్టు మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆ కరెన్సీ నోట్లు నాసిక్లోని కరెన్సీ నోట్ ప్రెస్లో ప్రింట్ చేశారని వెల్లడైనట్టు తెలిపారు. ఈ ప్రెస్కు పేపర్ను సెక్యురిటీ పేపర్ మిల్(ఎస్పీఎమ్) హోసంగాబాద్ సరఫరా చేసిందని, ఈ విషయంపై వెంటనే ఆ యూనిట్లపై విచారణకు ఆదేశించామని వెల్లడించారు. 
 
మరిన్ని వార్తలు