దీపావళి కానుకగా 8.56శాతం డీఏ!

24 Oct, 2013 02:49 IST|Sakshi
దీపావళి కానుకగా 8.56శాతం డీఏ!

వచ్చే నెల నుంచి కరువు భత్యం మంజూరుకు సీఎస్ హామీ
ఐఆర్‌పై సీఎంతో  చర్చిస్తామన్నారు
సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధుల వెల్లడి

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ దీపావళి కానుకగా వచ్చే నెల నుంచి 8.56 శాతం కరువు భత్యం (డీఏ) మంజూరుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పి.కె. మహంతి సుముఖత వ్యక్తం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. పదో వేతన సంఘం సిఫారసులు అమల్లోకి వచ్చే వరకూ 45 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలని వేతన కమిషన్ చైర్మన్ పి.కె.అగర్వాల్‌కు, సీఎస్‌కు బుధవారం వినతిపత్రం సమర్పించిన అనంతరం సమాఖ్య ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల నుంచి 8.56 శాతం డీఏ ఇస్తామని, ఐఆర్ విషయంలో ముఖ్యమంత్రితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చారని సమాఖ్య ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ, కో చైర్మన్ నరేందర్‌రావు తెలిపారు. హామీ ఇచ్చిన సీఎస్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ‘గత కొంతకాలంగా ఇతర కారణాల వల్ల ఉద్యోగ లోకం సమస్యలపై దృష్టి పెట్టలేకపోయింది.
 
  చివరకు బుధవారం సమాఖ్య ద్వారా అన్ని సంఘాల ప్రతినిధులమంతా పీఆర్‌సీ చైర్మన్‌ను క లిశాం. గత జూలై ఒకటో తేదీ నుంచి వర్తించేలా 45 శాతం ఐఆర్ ఇవ్వాలని కోరాం. అనంతరం సీఎస్‌ను కలిసి 45 శాతం ఐఆర్ ప్రకటించాలని, తక్షణమే డీఏ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాం..’ అని చెప్పారు. తాము చర్చించి వచ్చిన కొద్దిసేపటికే డీఏకి సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖకు కూడా పంపించారని తెలిపారు. ఐఆర్, ఇతర డిమాండ్ల విషయమై ముఖ్యమంత్రితో చర్చించి ఉద్యోగులకు సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని సీఎస్ చెప్పారన్నారు. పదోన్నతుల కోసం డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ల కమిటీ (డీపీసీ)లను వేయాలన్న తమ డిమాండ్ విషయంలోనూ సీఎస్ సానుకూలంగా స్పందించినట్లు మురళీకృష్ణ, నరేందర్‌రావు వివరించారు. మీడియా సమావేశానంతరం సీమాంధ్ర, తెలంగాణ సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉమ్మడిగా సచివాలయ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు.
 
 చాలాకాలం తర్వాత ఉమ్మడి ప్రెస్‌మీట్: ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో 2 నెలలకు పైగా సచివాలయంలో పోటాపోటీ నిరసనలు, ఆందోళనలు నిర్వహించిన సచివాలయ తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు ఇప్పుడు ఒక్కటయ్యారు. తమ సమస్యలపై కలిసి పోరాడేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో పీఆర్సీ చైర్మన్, సీఎస్‌లను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. సమాఖ్య ఉపాధ్యక్షులు టి. వెంకట సుబ్బయ్య, కన్వీనర్ పద్మాచారి తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు