రక్షణ బడ్జెట్‌కు కోత?

23 Nov, 2013 04:45 IST|Sakshi
రక్షణ బడ్జెట్‌కు కోత?

న్యూఢిల్లీ: రక్షణ శాఖ బడ్జెట్‌కు మరింతగా కోత పడవచ్చని ప్రధాని మన్మోహన్‌సింగ్ సంకేతాలిచ్చారు. ‘‘రక్షణ అవసరాలను తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాల్సిందే. కాకపోతే రక్షణ పరికరాలు, సాయుధ సంపత్తి తదితరాల కొనుగోళ్ల సందర్భంగా ఆర్థిక మందగమనాన్ని, మనకందుబాటులో ఉన్న పరిమిత వనరులను దృష్టిలో ఉంచుకోవాలి. ‘గుడ్డ కొద్దీ చొక్కా’ తరహాలో వ్యవహరించాలి’’ అని సూచించారు.
 
 అంతేగాక రక్షణ కొనుగోళ్లలో ప్రైవేట్ రంగాన్ని కూడా భాగస్వామిని చేయాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం త్రివిధ దళాలకు చెందిన సైనిక ఉన్నతాధికారుల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆర్థిక మందగమనాన్ని పొంచి ఉన్న పెను ప్రమాదంగా అభివర్ణించారు. రక్షణ ఆధునీకీకరణలో భాగంగా వచ్చే పదేళ్లలో ఏకంగా రూ.6 లక్షల కోట్లను సైనిక కొనుగోళ్లపై వెచ్చించాలన్న భారీ ప్రతిపాదనల నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
 
  గతేడాది రక్షణ శాఖకు కేటాయించిన బడ్జెట్‌లో కేంద్రం రూ.14,000 కోట్లు కోత విధించడం తెలిసిందే. ఈ ఏడాది బడ్జెట్‌లో రక్షణ శాఖకు రూ.2.06 లక్షల కోట్లు కేటాయించినా, కోత కూడా గతేడాది కంటే ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు. ఇక విధాన నిర్ణయాలు తదితరాల్లో పౌర నాయకత్వం-సైన్యం మధ్య సమతుల్యం అవశ్యమంటూ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దిశగా మున్ముందు తీసుకోవాల్సిన చర్యలపై బ్లూప్రింట్ తయారు చేయాల్సిందిగా సైనికాధికారులను కోరారు. వాటిని కేంద్రం అత్యంత ప్రాధాన్యమిచ్చి పరిశీలిస్తుందని చెప్పుకొచ్చారు. దేశ రాజకీయ నాయకత్వానికి సైన్యంపై పూర్తి విశ్వాసముందని కూడా మన్మోహన్ చెప్పారు. రాజకీయాలతో నిమిత్తం లేని మన సైన్యం వ్యవహార శైలి, వృత్తి నిబద్ధత ప్రపంచ దేశాలన్నింటికీ ఈర్ష్య కలిగించే అంశమంటూ ప్రస్తుతించారు. కేంద్రంతో ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ వివాదాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు. సదస్సులో రక్షణ మంత్రి, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు