ఆవుపేడపై పరిశోధనకు ఓ కమిటీ!

13 Feb, 2017 08:31 IST|Sakshi
ఆవుపేడపై పరిశోధనకు ఓ కమిటీ!
వ్యాధులను నయం చేయడంలో గోమూత్రం, గోమయం (ఆవుపేడ) పాత్ర ఏమైనా ఉందా అనే విషయాన్ని నిర్ధారించడానికి పలువురు శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులతో కూడిన కమిటీని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆవు పవిత్రమైనదని, దాని మూత్రం, పేడలతో అపార ప్రయోజనాలున్నాయని చెబుతున్న వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు ఈ విషయంలో వాస్తవాలను శాస్త్రీయంగా రుజువు చేసేందుకు ఈ కమిటీని నియమిస్తామని కేంద్రం తెలిపింది. ఆవు మూత్రం, పేడ, పాలు, పెరుగు, నెయ్యి.. వీటన్నింటితో కూడిన 'పంచగవ్య'కు ఔషధ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని ఈ కమిటీ నిర్ధారించాల్సి ఉంటుంది. ఐఐటీ ఢిల్లీలోని సెంటర్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ టెక్నాలజీ (సీఆర్‌డీటీ) ఈ మొత్తం కార్యక్రమాన్ని సమన్వయం చేస్తుంది. 
 
ఐఐటీ ఢిల్లీలో జరిగే జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశంలో దీనిపై వివరంగా చర్చిస్తామని సీఆర్‌డీటీ అధిపతి ప్రొఫెసర్ వీరేంద్రకుమార్ తెలిపారు. స్టీరింగ్ కమిటీలో ఎవరెవరు ఉంటారన్న విషయాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ త్వరలోనే తెలియజేస్తుందని ఆవు మూత్రం, పేడలపై దీర్ఘకాలంగా పరిశోధన చేస్తున్న విజయ్ తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి వైఎస్ చౌదరి కమిటీ విషయాన్ని తెలిపారు. అయితే కమిటీ కోసం ప్రత్యేకంగా నిధులు మాత్రం ఏమీ కేటాయించలేదు. ఆర్ అండ్ డీ స్కీము కిందే దీనికి నిధులిస్తామన్నారు. 
మరిన్ని వార్తలు