శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్‌?

9 Feb, 2017 17:16 IST|Sakshi
శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్‌?
  • ఆ విచక్షణాధికారం ఉందంటున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

  • తమిళనాట అధికార అన్నాడీఎంకేలో సంక్షోభం తారస్థాయిలో చేరిన నేపథ్యంలో గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నది. శశికళను ఇప్పటికే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. తమకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆమె వర్గం చెబుతున్నది. తనకు కూడా మెజారిటీ ఉందని, అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశమిస్తే.. తన బలమేమిటో నిరూపించుకుంటానని పన్నీర్‌ సెల్వం చెప్తున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలను చూస్తే ప్రస్తుతం పన్నీర్‌ సెల్వం వద్దు ఆరుగురు ఎమ్మెల్యేలకు మించి బలం లేదని చెప్తున్నది.

    దీంతో అంకెల సమీకరణాలు ఇప్పుడు తమిళనాట ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శశికళ, పన్నీర్‌ సెల్వంలలో ఎవరి ముఖ్యమంత్రి కావాలన్న మ్యాజిక్‌ ఫిగర్‌ 117 ఉండాల్సిందే. దీంతో మెజారిటీ మద్దతు ఉన్న శశికళను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని గవర్నర్‌ ఆహ్వానించకతప్పదా? అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్‌ నేత, కేంద్రమాజీ మంత్రి చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన అధికార పార్టీ నేత ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేయించే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉంటుందని ఆయన తెలిపారు. తన పుస్తకం 'ఫియర్‌లెస్‌ ఇన్‌ అపోజిషన్‌' విడుదల సందర్భంగా ఆయన 'ది హిందూ'తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

    'మెజారిటీ సంఖ్యాబలమున్న పార్టీ నాయకుడితో ప్రమాణం చేయించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత గవర్నర్‌కు ఉంటుంది. ప్రస్తుతమున్న ఆయా కారణాల వల్ల ప్రమాణాన్ని కొద్దిరోజులు వాయిదా వేస్తున్నానని చెప్పే విచక్షణాధికారం కూడా గవర్నర్‌కు ఉంటుంది. ఇది చిన్నపాటి అవకాశం. రాజ్యాంగబద్ధత దీనికి ఉందా? లేదా? అన్నది చూడలేదు కానీ, ఈ అవకాశం గవర్నర్‌కు ఉంటుందని నేను భావిస్తున్నా' అని ఆయన చెప్పారు.

    ప్రస్తుతం గవర్నర్‌ ముందు నాలుగు ఆప్షన్స్‌ ఉన్నాయని, ఈ నాలుగు ఆప్షన్లలో (శశికళను వేచి ఉండమని చెప్పడం, ఆమెను  ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, పన్నీర్ సెల్వానికి మరో అవకాశం ఇవ్వడం, రాష్ట్రపతి పాలన విధించడం) ఆయన దేనిని ఎంచుకుంటారన్నది రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాయిదా ఆప్షన్‌ కూడా ఆయన ఎంచుకుంటారా? అన్నది చూడాలి అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
     

మరిన్ని వార్తలు