ఏటీఎంల్లో నగదు విత్‌ డ్రా పై గుడ్‌ న్యూస్‌!

8 Feb, 2017 15:41 IST|Sakshi
నగదు విత్‌ డ్రా పై ఆంక్షలు ఎత్తివేత!
ముంబై : పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత నేపథ్యంలో బ్యాంకుల్లో, ఏటీఎంలలో విధించిన ఆంక్షల నుంచి ఇక ప్రజలకు పూర్తి విముక్తి లభించనుంది. ఈ ఆంక్షలను సేవింగ్స్ అకౌంట్స్కు 2017 మార్చి 13 నుంచి పూర్తిగా ఎత్తివేయనున్నట్టు రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. రెండు విడతల్లో నగదు  విత్‌ డ్రా పరిమితి పై ఆంక్షలు తొలగిస్తామన్నారు. తొలుత 2017 ఫిబ్రవరి 20న ప్రస్తుతం వారానికి రూ.24వేలుగా ఉన్న విత్ డ్రా పరిమితిని రూ.50వేలకు పెంచుతామని ఉర్జిత్ తెలిపారు.
 
ఆరవ ద్వైపాక్షిక సమీక్షను బుధవారం ప్రకటించిన ఉర్జిత్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ నగదు విత్ డ్రాపై విధించిన ఆంక్షలపై కూడా గుడ్న్యూస్ ప్రకటించింది. కాగ, నేటి ప్రకటనలో ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు కీలక నిర్ణయం వెలువరించింది. దీంతో రెపో రేటు 6.25 శాతం, రివర్స్ రెపో రేటు 5.75 శాతంగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ నిర్వహించిన పాలసీలో ఇది రెండవది.  బ్యాంకుల్లో వడ్డీరేట్లు కూడా కిందకి దిగిరానున్నట్టు ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.