ఉత్కంఠ రేపుతున్న తమిళ రాజకీయం!

19 Sep, 2017 16:19 IST|Sakshi
  • చెన్నైకి చేరుకున్న గవర్నర్‌..మరికాసేట్లో సీఎంతో భేటీ
  • సాక్షి, చెన్నై: పళనిస్వామికి బలపరీక్ష ముప్పు.. దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు నేపథ్యంలో గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు మంగళవారం చెన్నైకి చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన సీఎం పళనిస్వామితో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ అనంతరం అవిశ్వాస తీర్మానంపై గవర్నర్‌ నిర్ణయం తీసుకునే అవకాశముంది. రాజకీయ ఉత్కంఠకు తెరదించేవిధంగా బలపరీక్ష విషయంలో గవర్నర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వారం తర్వాత గవర్నర్‌ విద్యా సాగర్‌రావు చెన్నైకి రావడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలపై వేటు నేపథ్యంలో అసెంబ్లీలో బలపరీక్షకు సీఎం పళనిస్వామి గవర్నర్‌ ఆదేశాలు ఇచ్చే అవకాశముందని అంటున్నారు.

    మరోవైపు స్పీకర్‌ ధనపాల్‌ తమపై అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ.. దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. చట్టవిరుద్ధంగా స్పీకర్‌ తమపై అనర్హత వేటు వేశారని వారు ఆరోపించారు. ఇక తాజా రాజకీయ ఉత్కంఠ నేపథ్యంలో డీఎంకే కూడా పావులు కదుపుతోంది. దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్‌ వేటు నేపథ్యంలో స్టాలిన్‌ అధ్యక్షతన డీఎంకే శాసనసభాపక్షం మంగళవారం సాయంత్రం 5గంటకు భేటీ కానుంది. ఈ భేటీ అనంతరం డీఎంకేతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన 100మంది ఎమ్మెల్యేలు సామూహికంగా రాజీనామా చేయనున్నట్టు వినిపిస్తోంది. పళనిస్వామి సర్కారును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ డీఎంకే రాజీనామా అస్త్రాన్ని సంధించవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఎంకే శాసనసభా భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తసికరంగా మారింది.

    దినకరన్‌ వర్గం తిరుగుబాటుతో సీఎం పళని స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే సర్కారు మైనారిటీలో పడ్డ విషయం తెలిసిందే. దినకరన్‌కు మద్దతుగా 21 మంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తుండడంతో సీఎం పళనిస్వామి సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. మైనారిటీలో ఉన్న పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తూ వస్తున్నాయి. బల పరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం కోర్టుకు చేరింది.
     

మరిన్ని వార్తలు