రూ.3,770 కోట్ల బ్లాక్‌మనీ

2 Oct, 2015 03:28 IST|Sakshi
రూ.3,770 కోట్ల బ్లాక్‌మనీ

న్యూఢిల్లీ: నల్ల ధనవంతులు విదేశాల్లోని తమ అక్రమాస్తులను స్వచ్ఛందంగా వెల్లడించడం కోసం ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక సింగిల్ విండో కార్యక్రమం ద్వారా రూ. 3,770 కోట్ల విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన ఈ సౌలభ్యం ద్వారా 638 మంది తమ విదేశీ అక్రమాస్తులను వెల్లడించారని పేర్కొంది. ఈ వివరాలను పరీక్షించాల్సి ఉందని, వారు డిసెంబర్ 31లోగా 30% జరిమానా, మరో 30% పన్ను  చెల్లించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ స్వచ్ఛంద వెల్లడి కాలపరిమితి ముగిసినందున, విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టి, వాటి వివరాలు వెల్లడి చేయని వారిపై చర్యలు ప్రారంభిస్తామని ప్రకటించింది.
 
 నూతన నల్లధన వ్యతిరేక చట్టంలో 90 రోజుల కాలపరిమితిలో ఈ స్వచ్ఛంద వెల్లడి పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సెప్టెంబర్ 30 తుది గడవు కావడంతో, ఆ రోజు ఢిల్లీలోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో స్వచ్ఛంద వెల్లడి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద నల్ల కుబేరులు పెద్ద ఎత్తున క్యూ కట్టి కనిపించారు. కాగా, నల్లధనానికి సంబంధించి ప్రభుత్వ తాజా ప్రకటనపై కాంగ్రెస్ విమర్శించింది. ‘స్వచ్ఛంద వెల్లడి’ ద్వారా రూ. 6,500 కోట్ల నల్లధనం వెల్లడయిందంటూ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ ప్రస్తావించడాన్ని గుర్తుచేస్తూ.. తాజా లెక్కలు ఆయన మాటల్లోని డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్  విమర్శించారు.
 
  విదేశాల్లో భారతీయులు దాచిన 80 లక్షల కోట్ల అక్రమాస్తులను తీసుకువస్తామని, ప్రతీ భారతీయుడి ఖాతాలో రూ. 15 లక్షల జమ చేస్తామన్న మోదీ హామీని గుర్తు చేశారు. కాంగ్రెస్ విమర్శలపై  జైట్లీ స్పందిస్తూ.. ఈ రూ. 3,770 కోట్లు స్వచ్ఛంద వెల్లడికి సంబంధించినవని.. మోదీ చెప్పిన రూ. 6,500 కోట్లు వేరే అన్నారు.  నల్లధనం డాటాను క్రోడీకరించడానికి ఐటీ శాఖ కొత్త సాఫ్ట్‌వేర్‌ను వాడనుంది.
 

మరిన్ని వార్తలు