ప్రభుత్వానికి ‘అసహనం’ పరీక్ష

30 Nov, 2015 04:45 IST|Sakshi
ప్రభుత్వానికి ‘అసహనం’ పరీక్ష

వేడెక్కనున్న శీతాకాల సమావేశాలు
* అసహనంపై నేడు లోక్‌సభలో చర్చ షురూ

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి సోమవారం నుంచి ‘అసహనం’ పరీక్ష ఎదురుకానుంది. దేశంలో పెరుగుతున్న అసహనంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పలు ప్రతిపక్షాలు రెండు సభల్లోనూ నోటీసులు ఇవ్వడంతో సోమవారం నుంచి ఈ అంశంపై చర్చ మొదలుకానుంది. అనుచిత వ్యాఖ్యలు చేసిన కొందరు మంత్రులపై చర్యలు తీసుకోవాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

కాంగ్రెస్, జేడీయూ, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు అసహనంపై చర్చకు ఓటింగ్‌తో లేదా ఓటింగ్ లేకుండా చర్చ, తీర్మానానికి ఉభయ సభల్లోనూ నోటీసులు ఇచ్చాయి. లోక్‌సభలో సోమవారం నుంచి చర్చ ప్రారంభం కానుండగా.. రాజ్యసభలో మాత్రం ఈ వారంలో ఏదో ఒక రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. తొలి రెండ్రోజులు రాజ్యాంగంపై చర్చలో అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నా సభకు అంతరాయం కలగలేదు.

అయితే సోమవారం నుంచి అసహనంపై చర్చ జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఎదురుదాడి చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే కీలకమైన బిల్లుల ఆమోదానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ప్రతిపక్షాలను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నెల 25న జరిగిన అఖిలపక్ష సమావేశంలో అసహనం అంశంపైనే ఎక్కువగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే.   
 
‘వినియోగదారుల బిల్లు’ మరింత జాప్యం

వినియోగదారుల హక్కుల పరిరక్షణ బిల్లు-2015 పార్లమెంటుకు రావడం ఆలస్యం కావొచ్చు. ఆహార, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లును పరిశీలిస్తోంది. దీనిపై కమిటీ నివేదిక ఇవ్వాల్సిన గడువును కేంద్రం వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశాల మొదటివారం వరకు  పొడిగించింది. కాగా, లోక్‌పాల్ బిల్లుపై పార్లమెంటరీ స్థాయీ సంఘం ఏడాది చర్చల తర్వాత దానిపై ముసాయిదా నివేదికను సిద్ధం చేసింది. తుది నివేదికను వచ్చే నెల మొదట్లో రాజ్యసభకు సమర్పించనుంది.

>
మరిన్ని వార్తలు