ఉల్లి ఎగుమతి ధర పెంపు

3 Jul, 2014 02:35 IST|Sakshi
ఉల్లి ఎగుమతి ధర పెంపు

* నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి ఉల్లి, బంగాళాదుంప

న్యూఢిల్లీ: నిత్యావసర ఆహారపదార్థాల ధరలు పెరుగుతుండటంపై ఆందోళనకు గురవుతున్న కేంద్ర ప్రభుత్వం.. వాటిని అదుపులో పెట్టేందుకు నడుం బిగించింది. అందులో భాగంగా ఉల్లిగడ్డల కనీస ఎగుమతి ధర(ఎంఈపీ)ను టన్నుకు 500 డాలర్లకు(రూ. 29,773) పెంచుతూ బుధవారం నిర్ణయం తీసుకుంది. తద్వారా దేశీ మార్కెట్లో వీటి సరఫరా మెరుగవడంతో పాటు ధర కూడా తగ్గుతుందని భావిస్తోంది.

కనీస ఎగుమతి ధర కన్నా తక్కువ ధరకు ఎవరూ ఎగుమతి చేయకూడదు. యూపీఏ ప్రభుత్వం మార్చి నెలలో ఉల్లిపాయల ఎగుమతిని నిషేధించగా.. నెలక్రితం వాటి ఎగుమతులకు అనుమతిస్తూ, ఎంఈపీని 300 డాలర్లుగా నిర్ణయించారు. మరోవైపు, ధరల తగ్గింపు లక్ష్యంగా బుధవారం ప్రధాని నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
 
వాటిలో కొన్ని..

* ఉల్లి, బంగాళాదుంపలను నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి చేర్చారు. తద్వారా వాటి లభ్యత పెరగడంతో పాటు, వాటిని అక్రమంగా నిల్వ చేయడం శిక్షార్హమవుతుంది. బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడం సాధ్యమవుతుంది. చట్టప్రకారం ఎంత మొత్తాల్లో నిల్వ చేయొచ్చనేది రాష్ట్రాలు నిర్ణయిస్తాయి. 1999 -2004 మధ్య కూడా ఉల్లి, బంగాళాదుంపలు నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోనే ఉన్నాయి.

* ఆహార భద్రత చట్టం అమల్లో లేని రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరఫరా చేసేందుకు అదనంగా 50 లక్షల టన్నుల బియ్యాన్ని విడుదల చేయాలి.
 
రేపు రాష్ట్రాలతో కేంద్రం సమావేశం
సాక్షి, హైదరాబాద్ : నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ కోసం తీసుకునే చర్యలపై చర్చించడానికి అన్ని రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసింది.  ఈనెల 4న ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం కూడా హాజరుకానుంది.  రాష్ర్ట ఆర్థిక, పౌరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తోపాటు పౌరసరఫరాలశాఖ కమిషనర్ పార్థసారథి, ఇతర అధికారులు ఇందులో పాల్గొననున్నారు. రాష్ర్టంలో కూడా బియ్యంతోపాటు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు