ప్రభుత్వమే నిర్ణయించాలి

11 Sep, 2015 02:54 IST|Sakshi
ప్రభుత్వమే నిర్ణయించాలి

మానవసహిత అంతరిక్ష ప్రయోగంపై ఇస్రో చీఫ్
రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరు
 
సాక్షి, హైదరాబాద్: మానవసహిత అంతరిక్ష ప్రయోగం ఎప్పుడు జరగాలని నిర్ణయించాల్సింది ఈ దేశ ప్రజలు, ప్రభుత్వమేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ ఎ.ఎస్.కిరణ్ కుమార్ తెలిపారు. అంతరిక్ష ప్రయోగాలను మానవ సమాజాభివృద్ధికి మెరు గ్గా ఉపయోగించుకోవాలన్నదే ఇస్రో లక్ష్యమన్నారు. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 15వ వార్షికోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కిరణ్ కుమార్ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. శాస్త్రవేత్తలైనా, ఆధ్యాత్మికవేత్తలైనా ఇద్దరి లక్ష్యం సత్యాన్వేషణేనని చెప్పారు.
 
 దాదాపు వందేళ్ల క్రితమే వివేకానందుడి ఆలోచనల ఫలితంగా బెంగళూరులో దేశం గర్వించదగ్గ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏర్పడిందని... అక్కడ చదివిన విక్రమ్ సారాభాయ్, సతీశ్ ధావన్ వంటి మహామహులు ఇస్రోకు ప్రాణం పోశారని కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో జరుగుతున్న పరిశోధనలను గమనిస్తే ప్రతిసృష్టితోపాటు ప్రకృతి వైపరీత్యాలను అధిగమించడం కష్టం కాకపోవచ్చన్నారు. కార్యక్రమంలో రామకృష్ణ మఠం హైదరాబాద్ విభాగం అధ్యక్షుడు జ్ఞానానంద మహారాజ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ డెరైక్టర్ వి.కె.గాడ్గిల్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు