‘గ్రేటర్’ సమస్యలకు ‘యాప్’తో చెక్

18 Dec, 2015 06:30 IST|Sakshi
‘గ్రేటర్’ సమస్యలకు ‘యాప్’తో చెక్

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)లో ప్రభుత్వ విభాగాలు మొబైల్ ‘యాప్’ బాటపట్టాయి. నగరవాసులకు యూజర్ ఫ్రెండ్లీ సేవలు అందించేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా గుంతలుపడ్డ రహదారులు.. మూతలు లేని మ్యాన్‌హోల్స్.. దెబ్బతిన్న వరదనీటి కాల్వలు.. తదితర సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు సరికొత్త యాప్‌ను రూపొందించాలని జీహెచ్‌ఎంసీ, జలమండలి నిర్ణయించాయి. ‘హెచ్‌ఎండబ్ల్యూ ఎస్‌ఎస్‌బీ’ పేరిట త్వరలోనే ఈ మొబైల్ యాప్ నగరవాసులకు అందుబాటులోకి రానుంది.

మీరు రహదారిపై వెళుతున్నప్పుడు ఎదురైన సమస్యలను మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాతో క్లిక్ మనిపించి.. ఈ యాప్ ద్వారా సంబంధిత విభాగాలకు చేరవేయవచ్చు. దీంతో సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించేందుకు వెంటనే రంగంలోకి దిగుతారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. మరో వారం రోజుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది.
 
యాప్ ఎలా వినియోగించాలి
* వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ నుంచి గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి ‘హెచ్‌ఎండబ్ల్యూ ఎస్‌ఎస్‌బీ’ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* అందులో కన్స్యూమర్ సర్వీసెస్ యాప్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
* ఇందులో మీ మొబైల్ నంబర్‌ను ఒకసారి నమోదు చేసుకోవాలి. పేరు, చిరునామా టైప్ చేయాలి.
* అప్పుడు మీ మొబైల్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ అందుతుంది. దీని ఆధారంగా దెబ్బతిన్న రోడ్లు, మ్యాన్‌హోల్స్, వరదనీటి కాల్వలపై ఫిర్యాదు చేయవచ్చు.
* అంతేకాదు మీ మొబైల్ నుంచి ఆయా సమస్యలను చిత్రీకరించి ఆ ఫొటోలను యాప్‌తో సంబంధిత విభాగాలకు పంపొచ్చు.
* ప్రతి ఫిర్యాదుకు నంబర్‌ను కేటాయిస్తారు. సదరు ఫిర్యాదు క్షణాల్లో సంబంధిత అధికారి వద్దకు వెళుతుంది.
* రోజువారీగా యాప్ ద్వారా అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఫొటోలతో పాటు డౌన్‌లోడ్ చేసి.. పరిష్కారానికి సంబంధిత సిబ్బందిని రంగంలోకి దించుతారు.
* సమస్య పరిష్కారమైన తర్వాత ఫిర్యాదు చేసిన వినియోగదారుని మొబైల్‌కు సంక్షిప్త సందేశం(ఎస్‌ఎంఎస్) ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తారు.

మరిన్ని వార్తలు