గ్రీన్‌కార్డు ఉంటే.. నిషేధం మినహాయింపు

2 Feb, 2017 14:09 IST|Sakshi
గ్రీన్‌కార్డు ఉంటే.. నిషేధం మినహాయింపు
ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికాలోకి ప్రవేశించకుండా అరికట్టేందుకు ఏడు ముస్లిం దేశాలపై మూడు నెలల పాటు విధించిన నిషేధానికి కొంత మినహాయింపు లభించింది. గ్రీన్ కార్డు ఉన్నవాళ్లయితే ఆ దేశాలకు చెందినవాళ్లయినా సరే నిరభ్యంతరంగా అమెరికాకు ప్రయాణం చేయొచ్చని, అందుకు ప్రత్యేక అనుమతులేవీ తీసుకోనవసరం లేదని ట్రంప్ యంత్రాంగం తెలిపింది. గ్రీన్ కార్డు ఉన్నవాళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికా రావచ్చని, ఇక్కడి నుంచి వెళ్లొచ్చని వైట్‌హౌస్ అధికార ప్రతినిధిన సీన్ స్పైసర్ చెప్పారు. 
 
ఏడు ప్రధాన ముస్లిం దేశాలకు చెందిన ప్రజలు మూడు నెలల పాటు అమెరికాకు రాకుండా వారిపై ట్రావెల్ బ్యాన్ విధించాలని కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా కలకలం రేగడంతో స్పైసర్ తాజా ప్రకటన వెలువడింది. ట్రంప్ ఆదేశాలపై అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆదేశాలు వెలువడిన వెంటనే గ్రీన్ కార్డులు ఉన్నవారిని కూడా విదేశాలకు వెళ్లే విమానాలు ఎక్కనివ్వలేదు. లేదా విదేశాల నుంచి వచ్చిన వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటినుంచి మాత్రం గ్రీన్‌కార్డు ఉన్నవారికి ఈ బాధలు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాలకు చెందినవారిని మూడు నెలల పాటు అమెరికాకు ప్రయాణాలు చేయకుండా నిషేధించిన విషయం తెలిసిందే.
మరిన్ని వార్తలు