జీఎస్టీకి ఆమోదం

30 Mar, 2017 02:00 IST|Sakshi
జీఎస్టీకి ఆమోదం

సీజీఎస్టీ, ఐజీఎస్టీ సహా నాలుగు బిల్లులకు లోక్‌సభ ఓకే
- ద్రవ్యబిల్లులుగా ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ
- హవాయి చెప్పులకు, బీఎండబ్ల్యూకు ఒకే పన్ను ఉండదు
- అందుకే వేర్వేరు శ్లాబులను కౌన్సిల్‌ ప్రతిపాదించింది
- ఏకీకృత పన్ను విధానంతో వ్యాపారస్తులపై వేధింపులుండవని స్పష్టీకరణ
- రాజ్యసభలో చర్చ మాత్రమే.. ఆమోదం అవసరం లేదు
 

ఇదీ లాభం..

  • పన్నుల వసూలు తేలిక .
  • జీఎస్టీతో పన్నుల ఎగవేతకు కళ్లెం పడుతుంది.
  • పన్నుల విధానం పారదర్శకంగా ఉంటుంది.
  • పన్ను భారం తగ్గటంతో కొన్ని రకాల వస్తువులు తక్కువ ధరకే లభ్యమవుతాయి


ప్రతిపాదిత పన్ను రేట్లు
5% - వంట నూనెలు, మసాలా దినుసులు, టీ, కాఫీ
12% - కంప్యూటర్లు, ప్రాసెస్డ్‌ ఆహారపదార్థాలు
18% - సబ్బులు, నూనెలు, షేవింగ్‌ సామాను
28% - విలాస వస్తువులు పొగాకు ఉత్పత్తులు

జీఎస్టీ అంటే...
దేశమంతా ఒకే పన్ను వ్యవస్థ అమలు కోసం, పన్నుపై పన్ను వేసే పద్ధతిని నిర్మూలించే ఉద్దేశంతో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని రూపొందించారు. ఒక్కమాటలో చెప్పాలంటే వస్తువులు లేదా సేవల సరఫరాపై విధించే సమగ్ర పన్ను. ప్రస్తుతం 150కి పైగా దేశాల్లో జీఎస్‌టీ లేదా వ్యాట్‌ అమలవుతోంది. అమలు విషయానికొస్తే... ఒక వస్తువు వినియోగదారుడిని చేరాలంటే ముడిసరుకు నుంచి తయారీ, హోల్‌సేల్, రిటైల్‌... ఇలా పలు దశలుంటాయి. సేవల విషయంలోనూ అంతే. ప్రతి దశలోనూ కొంత విలువ జోడిస్తారు. అందువల్ల ఈ దశలన్నింటిలో పన్ను వసూలవుతుంది. కొన్నిసార్లు పన్నుపై పన్ను వసూలు చేస్తున్నారు. జీఎస్టీ అమలుతో ఈ పన్నులన్నీ రద్దై ఒకే పన్ను అమలవుతుంది. కేంద్ర ఎక్సైజ్‌ సుంకం, రాష్ట్రాలు విధించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌), వినోద, విలాస, ప్రవేశ పన్ను, ఆక్ట్రాయ్‌ స్థానంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ఒక్కటే ఉంటుంది.

లాభమేంటి?
జీఎస్టీతో పన్నుల వసూలు సులభమవుతుంది. పన్నుల ఎగవేతను చాలావరకూ అరికట్టవచ్చు. పన్నుల విధానం పారదర్శకంగా ఉంటుంది. కొన్ని రకాల వస్తువులపై పన్ను భారం తగ్గడం వల్ల వినియోగదారులకు తక్కువ ధరకే లభ్యమవుతాయి. ఆహార ధాన్యాలు, పాలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, చికెన్, మటన్‌ వంటి నిత్యావసరాలపై ఎలాంటి పన్ను ఉండకపోవచ్చు

జీఎస్టీ అమలుతో పెరిగేవి... తగ్గేవి
తగ్గేవి: షాంపులు, చాక్లెట్లు, బ్రెడ్, బ్యాటరీలు, టాయిలెట్‌ వస్తువులు వంటి ఎక్కువగా అమ్ముడయ్యే(ఎఫ్‌ఎంసీజీ) వస్తువులు, రెస్టారెంట్లలో భోజనం, చిన్న కార్లు, డీటీహెచ్‌ డిష్‌లు.
పెరిగేవి: విలాసవంతమైన కార్లు; పొగాకు, కొన్ని రకాల శీతల పానీయాలు

న్యూఢిల్లీ: స్వతంత్ర భారతంలో అతిపెద్ద పన్ను సంస్కరణల విధానం అమలుకు మరో అడుగు ముందుకు పడింది. జీఎస్టీకి సంబంధించిన 4 అనుబంధ బిల్లులకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏడుగంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం.. సెంట్రల్‌ జీఎస్టీ బిల్లు –2017, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ బిల్లు–2017, యూనియన్‌ టెరిటరీ జీఎస్టీ బిల్లు–2017, జీఎస్టీ పరిహార బిల్లు (రాష్ట్రాలకు)–2017లను లోక్‌సభ ఆమోదించింది.

జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేద్దామనుకుంటున్న కేంద్రం ఆలోచనలకు మరో అడుగు ముందుకు పడింది. చర్చ సందర్భంగా విపక్ష పార్టీలు చేసిన సూచనలను కేంద్రం తిరస్కరించింది. పార్లమెంటులో బిల్లు ఆమోదంతో రాష్ట్రాల జీఎస్టీ బిల్లుకు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగాæజైట్లీ మాట్లాడుతూ.. జీఎస్టీ ద్వారా వస్తువులు, సేవల ధరలు పెరుగుతాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. దేశమంతా ఏకీకృత పన్ను విధానం అందుబాటులోకి వస్తే వస్తువుల ధరలు  తగ్గుతాయన్నారు.

వ్యాపారులపై వేధింపులుండవు
జీఎస్టీ అమల్లోకి రావటం ద్వారా వ్యాపారస్తులపై వివిధ ప్రభుత్వ విభాగాల అధికారుల వేధింపులు ఆగిపోతాయని.. ఒక వస్తువు దేశమంతా ఒకే ధరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఇప్పుడు వస్తువులపై వేసిన పన్నుపై మరో పన్ను విధిస్తారని.. వీటన్నింటినీ తొలగిస్తే వస్తువుల ధరలు కాస్త తగ్గుతాయన్నారు. వివిధ జీఎస్టీ ధరలు ఎందుకు విధించాల్సి వచ్చిందంటూ విపక్ష సభ్యులు వేసిన ప్రశ్నలకు జైట్లీ సమాధానం చెప్పారు. ‘అన్ని వస్తువులకు ఒకే పన్ను విధించటం సరికాదు. హవాయి చెప్పులకు, బీఎండబ్ల్యూ కారుకు ఒకే పన్ను విధించటం న్యాయం అనిపించుకోదు. ఆ వస్తువు వినియోగదారుడి ఆధారంగా పన్నులుండేలా జీఎస్టీ కౌన్సిల్‌ సిఫారసు చేసింది’ అని జైట్లీ లోక్‌సభలో స్పష్టం చేశారు. సెంట్రల్‌ జీఎస్టీ గరిష్టంగా 20 శాతం ఉండనుండగా.. స్టేట్‌ జీఎస్టీ 40 శాతం (గరిష్టం)గా నిర్ణయించారు. ఈ గరిష్ట విలువలన్నీ ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లోనే అమలు చేయనున్నారు. ఈ బిల్లు పన్ను చెల్లింపును తప్పనిసరి చేయటంతోపాటుగా.. చెల్లించిన పన్నులకు ఇన్‌పుట్‌ క్రెడిట్‌ పొందేందుకు వీలుంటుంది.

ద్రవ్యబిల్లుగానే ఎందుకు?
జీఎస్టీకి సంబంధించిన నాలుగు బిల్లులను ద్రవ్యబిల్లులుగా ప్రవేశపెట్టడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్రం ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించాయి. దీనిపై జైట్లీ స్పందిస్తూ.. ‘రాజ్యాంగ నిబంధనల ప్రకారం 1950 నుంచి అన్ని పన్ను సంబంధిత బిల్లులను పార్లమెంటులో ద్రవ్యబిల్లులుగానే ప్రవేశపెడుతున్నారు’ అని స్పష్టం చేశారు. యాంటీ–ప్రాఫిటీరింగ్‌ నిబంధనల గురించి జైట్లీ వివరిస్తూ.. పన్ను రేట్లలో తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు లభిస్తాయన్నారు. ఈ విషయంలో సమన్యాయం జరుగుతుందన్నారు. వ్యవసాయాన్ని జీఎస్టీ పరిధిలోకి తేవటంపై విపక్షాల ఆందోళనలపై మంత్రి స్పందిస్తూ.. ‘ఈ బిల్లు వ్యవసాయానికి సంబంధించి ఒక స్పష్టమైన నిర్వచనాన్ని ఇచ్చింది. ఏయే అంశాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకోకూడదో స్పష్టం చేసింది’ అని తెలిపారు.

వ్యవసాయ ఉత్పత్తులపై ప్రస్తుతమున్న విధానమే కొనసాగుతుందని దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పన్నుల విషయంలో బ్యాంకులకు సంబంధించిన అంశాలపై జీఎస్టీ కౌన్సిల్‌ తుది నిర్ణయం తీసుకుంటుందని జైట్లీ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి జీఎస్టీ వర్తించదని మంత్రి వెల్లడించారు. జీఎస్టీని ఆడిట్‌ చేయటంపై జైట్లీ వివరణ ఇస్తూ.. రాజ్యాంగ బద్ధంగా కాగ్‌కు ఉన్న అధికారాల ప్రకారమే ఆడిటింగ్‌ జరుగుతుందని తెలిపారు. ‘జీఎస్టీ ఆలోచన కేంద్ర, రాష్ట్రాల అధికారాల మధ్య అస్పష్టతను సృష్టించింది. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాలు కలిసి సంయుక్తంగా ఒకే పన్నును నిర్ధారిస్తాయి’ అని జైట్లీ స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం దాదాపు ప్రస్తుత స్థితిలోనే కొనసాగుతుందని ఆయన తెలిపారు. జీఎస్టీ అమలు త్వరలో ప్రారంభం కానుందన్న మంత్రి.. ఈ చట్టం పరిధిలోకి వచ్చే వస్తువుల వర్గీకరణను వచ్చేనెల్లో ప్రారంభిస్తామన్నారు. ‘పన్నుల పరిధిలోకి రావాల్సిన వాటిపై జీఎస్టీ కౌన్సిల్‌లో ఏకాభిప్రాయం సాధించాం. దేశంలో ఓ బిల్లుపై ఏకాభిప్రాయం రావటం ఇదే తొలిసారి. జీఎస్టీ కౌన్సిల్‌ దేశంలోనే తొలి సమాఖ్య సంస్థ. పరోక్ష పన్నులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపైకి వచ్చిన సంస్థ ఇది’ అని తెలిపారు. కౌన్సిల్‌ పనితీరుపై అన్ని పార్టీలు సానుకూల ధృక్పథంతో ఆలోచించాలన్నారు. ‘జీఎస్టీ కౌన్సిల్‌లోని 32 మంది సభ్యులు బిల్లులకు ఒకట్రెండు మార్పులు సూచించారు. వాటికి అంగీకరించాం. దీంతో ఏకాభిప్రాయం సాధించాం’ అని తెలిపారు. ‘జీఎస్టీ సభ్యులు, అధికారుల కృషి అద్భుతమైన 4 బిల్లుల రూపంలో లోక్‌సభలో ఆమోదం పొందింది’ అని రెవెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్‌ అధియా ట్వీట్‌ చేశారు.

సీజీఎస్టీ బిల్లు

  • వస్తువులు, సేవల అంతర్రాష్ట్ర సరఫరాలపై కేంద్రం విధించే సీజీఎస్టీ– జమ్మూ,కాశ్మీర్‌ మినహా మొత్తం దేశానికి వర్తిస్తుంది.
  • షెడ్యూల్‌ 1 రెడ్‌విత్‌ 7 ప్రకారం, ఒక ఏడాదిలో ఒక యజమాని ఒక ఉద్యోగికి రూ.50,000లోపు ఇచ్చే బహుమతి వస్తు, సేవల సరఫరాగా పరిగణించరాదు.
  • షెడ్యూల్‌ 3 ప్రకారం, కొన్ని కార్యకలాపాలను వస్తు, సేవలుగా పరిగణించరాదు.  ఇందులో లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లిగ్‌మినహా ఇతర ఆర్థిక క్లెయిమ్‌లు ఉన్నాయి. దేశంలో విదేశీ దౌత్య బృందం సేవలూ ఇదే కోవకు వస్తాయి. భవన నిర్మాణం, భూ అమ్మకాలు ఈ పరిధిలో ఉన్నాయి.
  • ఆల్కాహాలిక్‌ లిక్కర్‌ సరఫరాల మినహా ఇతర అంతర్రాష్ట్ర వస్తుసేవల సరఫరాలకు సీజీఎస్టీ వర్తిస్తుంది.
  • సీజీఎస్టీ రేట్‌ పరిమితిని 14 శాతం నుంచి 20 శాతానికి పెంచడం జరిగింది.
  • జీఎస్టీ మండలి సిఫారసులపై ప్రభుత్వం నోటిపై చేసిన తేదీ నుంచి పెట్రోలియం క్రూడ్, హైస్పీడ్‌ డీజిల్‌ (హెచ్‌ఎస్‌డీ), పెట్రోల్, నేచురల్‌ గ్యాస్, ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయెల్‌ (ఏటీఎఫ్‌)ల సరఫరాలపై సీజీఎస్టీ అమలవుతుంది.
  • జీఎస్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్‌తో ఎటువంటి సంబంధం లేకుండా, వస్తు, సేవలకు సంబంధించి సమగ్రమైన రికార్డులను ట్రాన్స్‌ పోర్టర్‌ కలిగిఉండాలి. వార్షిక రిటర్న్స్‌ సమర్పించిన తేదీ నుంచి 72 నెలల లోపు అకౌంట్, రికార్డ్‌ పుస్తకాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిని సమర్పించడానికి గడువు ఇంతకుముందు 60 నెలలుగా ఉండేది.  


ఐజీఎస్టీ బిల్లు
జీఎస్‌టీలోని ప్రధాన మూడు భాగాల్లో (సీజీఎస్‌టీ, ఐటీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ) ఇంటిగ్రేటెడ్‌ వస్తు, సేవల పన్ను ఒకటి. ఒకదేశం–ఒకే పన్ను భావనకు ఇదే మూలం. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వస్తు, సేవల రవాణా సందర్భంలో ఐజీఎస్‌టీని కేంద్రం వసూలు చేస్తుంది. అధికారులు స్థిరీకరించిన రేట్ల ప్రకారం, ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్రాలు పంచుకుంటాయి. ఇది కూడా సీఎస్‌ఎస్‌టీ తరహాలోనే జమ్మూ,కాశ్మీర్‌కు కాకుండా మొత్తం దేశానికి వర్తిస్తుంది. పరిమితిని 28 శాతం నుంచి 40 శాతానికి పెంచారు. ఆల్కాహాలిక్‌ లిక్కర్‌పై ఐజీఎస్‌టీ ఉండదు.

యూటీజీఎస్టీ బిల్లు
యూటీజీఎస్‌టీ(కేంద్ర పాలిత ప్రాంతం జీఎస్టీ)... కేంద్ర పాలిత ప్రాంతాల్లో వస్తువులు, సేవలపై పన్ను వసూళ్లకు యూటీజీఎస్టీ నిబంధనలు వర్తిస్తాయి. అసెంబ్లీలు లేని కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే యూటీజీఎస్టీ అమలవుతుంది. ఢిల్లీ, పుదుచ్చేరిలకు అసెంబ్లీలు ఉన్నందుకు ఆ రెండూ చోట్ల మాత్రం ఎస్‌జీఎస్‌టీ అమలవుతుంది. రాష్ట్రాలకు ఎస్‌జీఎస్టీ అమలవుతున్నందుకు కేంద్ర పాలిత ప్రాంతాల కోసం అతి తక్కువ సమయంలో యూటీజీఎస్టీని రూపొందించారు. ఎస్‌జీఎస్టీలోని నిబంధనలే దాదాపుగా యూటీజీఎస్టీలో పొందుపర్చారు.

కొత్త ఏడాది, కొత్త చట్టం, కొత్త భారతం: మోదీ
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అనుబంధ బిల్లులను లోక్‌సభ బుధవారం ఆమోదించడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. బిల్లులు ఆమోదం పొందిన వెంటనే మోదీ హిందీలో ఓ ట్వీట్‌ చేస్తూ ‘జీఎస్టీ బిల్లులు ఆమోదం పొందినందుకు దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం, కొత్త చట్టం, కొత్త భారతం’అని పేర్కొన్నారు.

బీజేపీ వల్లే 12లక్షలకోట్ల నష్టం: మొయిలీ
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో జీఎస్టీని ప్రతిపాదిస్తే బీజేపీ అడ్డుపడిందని దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.12లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని.. కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి వీరప్పమొయిలీ విమర్శించారు. లోక్‌సభలో జీఎస్టీపై చర్చ సందర్భంగా ప్రభుత్వంపై మొయిలీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం తను తీసుకొచ్చిన విప్లవాత్మక పన్ను సంస్కరణలను మార్పుకు ముందడుగు’ అని చెప్పుకుంటున్నారని.. ఇది కేవలం అతి తక్కువ ప్రభావం చూపే చిరు ప్రయత్నం మాత్రమేనని మొయిలీ తెలిపారు. జీఎస్టీని సాంకేతిక పీడకలగా అభివర్ణించిన ఆయన.. దీని వల్ల లాభాలేమీ జరగవని, ఇదో అమానుషమైన నిర్ణయమని దుయ్యబట్టారు.

రాష్ట్రాలకు పరిహార బిల్లు
జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు ఏర్పడే నష్టం భర్తీ కోసం పరిహార చట్టాన్ని రూపొందించారు. నష్టాల భర్తీ కోసం రాష్ట్రాలకు మొదటి సంవత్సరం రూ. 50 వేల కోట్లు చెల్లించాల్సి రావచ్చని కేంద్రం అంచనా వేసింది. ఈ మొత్తంలో రూ. 26 వేల కోట్లను క్లీన్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెస్సుగా వసూలు చేస్తారు. ఇక మిగతా రూ. 24 వేల కోట్లను పొగాకు, విలాసవంతమైన కార్లు, పాన్‌ మసాల, కొన్ని శీతల పానీయాలపై అదనపు పన్ను ద్వారా సేకరిస్తారు. జీఎస్టీ అమలు తేదీ నుంచి ఐదేళ్ల పాటు రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తారు. రెండు నెలలకోసారి రాష్ట్రాలకు చెల్లింపులు చేస్తారు. ఐదేళ్ల అనంతరం పరిహార నిధిలో మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి.

మరిన్ని వార్తలు