అమ్మో.. ఒకటో తారీఖు

30 Jun, 2017 03:02 IST|Sakshi
అమ్మో.. ఒకటో తారీఖు

బ్యాంకుల్లో     నగదు నిల్‌
రేపటి నుంచి అమల్లోకి జీఎస్టీ
ఆందోళనలో వ్యాపారులు
మధ్య తరగతి ప్రజల్లో అయోమయం


నెల్లూరు (సెంట్రల్‌) :  పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులను నగదు కొరత వెంటాడుతోంది. మరోవైపు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి రాబోతోంది. ఈ పరిస్థితుల్లో జూలై 1వ తేదీ అటు వ్యాపారులను.. ఇటు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. హోటల్స్, మందులు, ఎరువులు, వస్త్రాల వ్యాపారులు జీఎస్టీ ప్రభావాన్ని తలచుకుని బెంబేలెత్తుతున్నారు. ఆ పన్నులను తమపైనే రుద్దుతారని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఎటు తిరిగి ఎటొచ్చినా ఆ ప్రభావం సామాన్య, మధ్య తరగతి ప్రజలతోపాటు చిరు వ్యాపారులపై పడుతుందనేది కలవరం రేపుతోంది.

బ్యాంకుల్లో నగదు లేదు
జిల్లాలో 424 ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు న్నాయి. వీటికి అనుబంధంగా 486 వరకు ఏటీఎంలు పని చేస్తున్నాయి. బ్యాంకుల్లో లావాదేవీలు నడవాలంటే రోజుకు కనీసం రూ.100 కోట్లు అవసరం. అంటే నెలకు రూ.3 వేల కోట్ల నగదును బ్యాంకులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కాగా, పెద్దనోట్లు రద్దయిన తరువాత  ఆర్‌బీఐ  నుంచి జిల్లాకు నామ        మాత్రంగానే కొత్త నోట్లు  వస్తున్నాయి. ప్రతినెలా 1–5వ తేదీల మధ్య జీతాలు, పింఛన్‌ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జూన్‌లోనూ నగదు కష్టాలు తలెత్తాయని బ్యాంకర్లు చెబుతున్నారు. జిల్లాలో 75 శాతం ఏటీఎంలు పనిచేయలేదు. ఈ పరిస్థితుల్లో వచ్చేనెల 1న నగదు ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావడం లేదని బ్యాంకర్లు పేర్కొంటున్నారు.
జీఎస్టీ అమలుతో ఆందోళన
మరోవైపు జీఎస్టీని తలచుకుని వస్త్ర వ్యాపారులు కలవరపడుతున్నారు. ముందెన్నడూ లేనివిధంగా పన్ను విధిస్తుండటంతో ఆవేదనకు గురవుతున్నారు. ఈ భారాన్ని ఎలా మోయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.

హోటల్స్‌దీ అదే తీరు
హోటల్స్‌పై జీఎస్టీ ప్రభావం అధికంగానే ఉండబోతోంది. ఇప్పటివరకు ఉన్న 5 శాతం పన్నును 18 శాతానికి పెంచనుండటంతో అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణులు వివిధ పనుల నిమిత్తం తరచూ పట్టణాలకు వస్తుంటారు. వారంతా ఏదో ఒక హోటల్‌కు వెళ్లి భోజనం లేదా టిఫిన్‌ చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే హోటళ్లలో ధరల వల్ల భోజనం చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి. జీఎస్టీ అమల్లోకి వస్తే ధరలు మరింత పెరుగుతాయి.

ఎరువుల పైనా..
జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఎరువులపై ప్రస్తుతం ఉన్న 5 శాతం పన్ను జీఎస్టీ అమల్లోకి వస్తే 12 శాతానికి పెరుగుతుంది. రైతులు ఇకపై 7 శాతం అదనంగా పన్ను భారం మోయాల్సి వస్తుంది.

టిక్కెట్‌ కొనకుండానే సినిమా కనిపిస్తుంది
ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్న వారు వారాంతం లేదా మాసాంతంలో సిని మా చూడటం ద్వారా రిలీఫ్‌ అవుతుంటారు. ఇప్పటికే ధరల బాదుడుతో అల్లాడుతున్న ప్రేక్షకులకు ఇకపై సినిమా మరింత భా రం కానుంది. టికెట్‌ ధరలపై 28 శాతం జీఎస్టీ భారం పడబోతోంది. కుటుంబ సభ్యులతో కలిసి సిని మాకు వెళ్లాలంటే రూ.వెయ్యి సరిపోని పరిస్థితి.
 

మరిన్ని వార్తలు