లోక్‌సభలోనూ జీఎస్టీ బిల్లుకు జేజేలు!

8 Aug, 2016 20:29 IST|Sakshi
లోక్‌సభలోనూ జీఎస్టీ బిల్లుకు జేజేలు!

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో భారీ పన్నుల సంస్కరణలకు తెరలేపనున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుకు లోక్‌సభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. లోక్‌సభలో మొత్తం 429 మంది సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. దీంతో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్టు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు. జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లును ఇటీవలే రాజ్యసభ కూడా ఆమోదించిన సంగతి తెలిసిందే.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతిపెద్ద పన్ను సంస్కరణగా జీఎస్టీ బిల్లును భావిస్తున్నారు. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో రూపొందిన ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ ఒకేవిధంగా పన్నుశాతం ఉంటుంది. దేశమంతా ఒకే మార్కెట్‌గా పరిగణించబడుతుంది. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించడంతోపాట దేశంలోని 50శాతం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలిపితే.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి  అమల్లోకి రానుంది.

మరిన్ని వార్తలు