జీఎస్టీపై 15% వరకు సెస్సు

17 Mar, 2017 02:09 IST|Sakshi
జీఎస్టీ మండలి సమావేశంలో మాట్లాడుతున్న అరుణ్‌ జైట్లీ

హానికారక ఉత్పత్తులపై 12–15 శాతం వరకు పెంచే అవకాశం
పరిహార నిధిని పెంచుకునేందుకేనన్న కేంద్రం


న్యూఢిల్లీ: లగ్జరీ వస్తువులు, శీతల పానీయాలపై అత్యధికంగా 28శాతం జీఎస్టీని వసూలు చేయనున్న ప్రభుత్వం.. వీటిపై అదనంగా విధించే సెస్సు పరిమితిని 15 శాతానికి పెంచింది. ఈ నిర్ణయానికి గురువారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. జీఎస్టీ అమలు ద్వారా ఆదాయం కోల్పోతున్న రాష్ట్రాలకు తొలి ఐదేళ్ల వరకు పరిహారం ఇచ్చే నిధిని సమకూర్చుకునేందుకు ఈ సెస్సును వినియోగిస్తారు. అయితే.. భవిష్యత్తులో ఈ నిధిని పెంచుకోవాల్సిన అవసరమున్నందున సెస్‌ను పెంచుకునేందుకు వీలుగానే పరిమితిని 12 నుంచి 15 శాతానికి పెంచినట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు.

కాగా, జీఎస్టీని ఈ ఏడాది జూలై 1నుంచి అమల్లోకి తెచ్చే దిశగా.. రాష్ట్రాల జీఎస్టీ (ఎస్‌–జీఎస్టీ), కేంద్ర పాలిత ప్రాంతాల జీఎస్టీ (యూటీ–జీఎస్టీ)లకు కూడా జీఎస్టీ కౌన్సిల్‌ గురువారం ఆమోదం తెలిపింది. ఈ ముసాయిదాలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన తర్వాత ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కొత్త పన్నుల విధానమైన జీఎస్టీలోని తొమ్మిది నిబంధనల్లో ఇప్పటికే ఐదింటికి (రిజిస్ట్రేషన్, పేమెంట్స్, రీఫండ్‌లు, ఇన్‌వాయిసెస్, రిటర్న్స్‌) కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

మిగిలిన నాలుగింటికి (కాంపోజిషన్, వాల్యుయేషన్, ఇన్‌పుట్‌ టాక్స్, క్రెడిట్‌ ట్రాన్సిషన్స్‌) మార్చి 31న జరిగే సమావేశంలో కౌన్సిల్‌ చర్చించనుంది. ఆ తర్వాత వివిధ వస్తువులపై జీఎస్టీ టాక్స్‌ శ్లాబుల (5%, 12%, 15%, 28%)పై నిర్ణయం తీసుకోనుంది. ప్రతి వెయ్యి సిగరెట్లకు రూ.4,170 లేదా 290శాతం పన్ను పరిమితి, టన్ను బొగ్గుపై 400శాతం సెస్సు విధించినట్లు ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. బీడీలపై సెస్సు విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు