ఎరువులపై 5 శాతం జీఎస్టీ

1 Jul, 2017 01:30 IST|Sakshi

► ట్రాక్టర్ల విడిభాగాలపై 18 శాతం
► విందు సమావేశంలో జీఎస్టీ మండలి నిర్ణయం
► హాజరైన ప్రధాని.. మండలి సభ్యులకు కృతజ్ఞతలు  


న్యూఢిల్లీ: జీఎస్టీ అమలుకు కొద్ది గంటల ముందు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశమై రైతులకు సంబంధించిన రెండు అంశాలపై పన్నురేటును తగ్గించింది. గతంలో 12 శాతం పరిధిలో ఉన్న ఎరువులను 5 శాతం పరిధిలోకి.. 28 శాతంగా ఉన్న ట్రాక్టర్ల విడిభాగాలను 18 శాతంలోకి చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ ఉత్పత్తిని పెంచటంతోపాటుగా రైతుకు మేలు చేసే దిశగా ఈ రెండింటిపై పన్ను తగ్గించినట్లు జైట్లీ తెలిపారు.

జీఎస్టీ కౌన్సిల్‌ సభ్యుల విందు భేటీకి ప్రధాని మోదీ హాజరై కౌన్సిల్‌ జీఎస్టీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 2016 సెప్టెంబర్‌ 23న జీఎస్టీ కౌన్సిల్‌ తొలిసారి సమావేశమైంది. ఆనాటి నుంచి నేటి వరకు 18 సార్లు ఈ మండలి సమావేశమైంది. విస్తృతమైన అంశాలపై కూలంకశంగా చర్చించి 5, 12, 18, 28 శాతం పన్ను పరిధిని నిర్ణయించింది. అయితే శుక్రవారంనాటి సమావేశంలో పలు ఇతర నిబంధనలకు కూడా మండలి ఆమోదం తెలిపిందని జైట్లీ వివరించారు.

తగ్గనున్న యూరియా ధరలు: జీఎస్టీ మండలి తాజా నిర్ణయంతో ఎరువుల ధరలు గణనీయంగా తగ్గుతాయని కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి అనంత్‌ కుమార్‌ వెల్లడించారు. యూరియా, డీఏపీ, ఎంవోపీ, మిశ్రమ ఎరువుల ధరలు తగ్గటం ద్వారా రైతులపై రూ.1,261 కోట్ల భారం తగ్గుతుందన్నారు.

నిజాయితీపరులకు లాభం..అధియా: జీఎస్టీ అమల్లోకి రావటం ద్వారా ఇన్నాళ్లూ నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న వారికి.. ఇకపై పన్నులు చెల్లించేవారికి లాభం జరుగుతుందని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా చెప్పారు. ఏడాదికి రూ.10లక్షల టర్నోవర్‌ ఉన్న వ్యాపారులు వ్యాట్‌ చెల్లించేవారు. అయితే వీరికి ఎక్సైజ్‌ సుంకం నుంచి మినహాయింపుండేది. కానీ ఇప్పుడు రూ. 20–75 లక్షల టర్నోవర్‌ ఉన్న వ్యాపారులు 2.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ. 20 లక్షల్లోపు టర్నోవర్‌ ఉండే వారికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది.

నేటి నుంచి ఎరువుల ధర
(50 కిలోల బస్తా ధర రూపాయల్లో)
ఎరువు రకం              ప్రస్తుత ధర       నేటి నుంచి ఇలా ఉండే అవకాశం
డీఏపీ                           1092                          1081
యూరియా                     290                            287
20:20 కాంప్లెక్స్‌              880                            871
పొటాష్‌                           580                             574

మరిన్ని వార్తలు