ఈ జీఎస్టీ అసమగ్రం

6 Apr, 2017 04:00 IST|Sakshi
ఈ జీఎస్టీ అసమగ్రం

40 శాతం ఆదాయం జీఎస్టీకి బయటే
రాజ్యసభలో విపక్షాల మండిపాటు
ద్రవ్య బిల్లుగా తీసుకురావడంపై అభ్యంతరం
నాలుగు జీఎస్టీ బిల్లులపై చర్చ ప్రారంభం


న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు సంబంధించిన నాలుగు బిల్లులపై బుధవారం రాజ్యసభలో చర్చ మొదలైంది. కేంద్ర (సీజీఎస్టీ), సమీకృత (ఐజీఎస్టీ), రాష్ట్రాలకు పరిహార జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంత జీఎస్టీ లపై కాంగ్రెస్‌ ఉప నేత ఆనంద్‌ శర్మ చర్చ ప్రారంభిస్తూ జీఎస్టీ అసమగ్రంగా ఉందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిం చారు.

 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పేర్కొన్న ఆదా యంలో 40శాతం జీఎస్టీకి బయటే ఉందని, అలాంటప్పుడు అది ఎలా ఆదర్శప్రాయమ వుతుందని ప్రశ్నించారు. మద్యం, పెట్రోలు, డీజిల్, రియల్‌ ఎస్టేట్‌ తదితరాలకు ఇచ్చిన మినహాయింపులు ఆందోళనకరంగా ఉన్నా యన్నారు. అక్రమ లావాదేవీలు, నల్లధనంపై పోరాడుతున్నా మన్న ప్రభుత్వం రియల్‌ ఎస్టే ట్‌ను ఎందుకు దీని పరిధిలోకి తీసుకు రాలేదని ప్రశ్నించారు.

 జీఎస్టీ అమలుకు ముం దు పన్ను చెల్లింపు దారులకు అధికారుల నుంచి వేధింపులు ఎదురుకాకుండా తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచిం చారు. దిగ్విజయ్‌ సింగ్, జైరాం రమేశ్‌ (కాంగ్రెస్‌) మాట్లా డు తూ.. ప్రధాని మోదీ గుజరాత్‌ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు జీఎస్టీని వ్యతిరేకించా రని, ఫలితంగా ప్రభుత్వఖజనాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపించారు. తాము ఈ బిల్లు లకు మద్దతిస్తూనే కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతు న్నామన్నారు.

 ‘జీఎస్టీ భావన మాజీ ప్రధాని వీపీ సింగ్‌ 1986లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే తెరపైకి వచ్చింది. ప్రస్తుత ప్రధా నికి ఎంత ఘనత దక్కాలో పాత ప్రధానులూ అంత ఘనతకు అర్హులు’ అని రమేశ్‌ అన్నారు. జీఎస్టీని ద్రవ్య బిల్లుగా తీసుకురావడాన్ని ఎస్పీ నేత నరేశ్‌ అగర్వాల్‌ తప్పుబట్టారు. రాజ్యసభ శాసన నిర్మాణ అధికారాల పునరు ద్ధరణకు ఆర్థిక మంత్రి జైట్లీ కృషి చేయాలని, రాజ్యాంగ సవరణ బిల్లు తేవాలని కోరారు. ‘హనుమంతునికి తన శక్తి గురించి ఇతరులు చెప్పాకే తెలిసింది. మీరు మా హనుమాన్‌. ఈ సభ నాయకులు’ అని అన్నారు.

కార్మిక పరిహార బిల్లుకు ఆమోదం
పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల్లో గాయపడే కార్మికులకు, వృత్తి సంబంధ వ్యాధులకు గురయ్యే కార్మికులకు రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు పరిహారాన్ని అందిం చేందుకు ఉద్దేశించిన ఉద్యోగుల పరిహార (సవరణ) బిల్లు–2016ను లోక్‌సభ సవరణలతో ఆమోదించింది. ఈ బిల్లును లోక్‌సభ గత ఏడాది ఆమోదించగా, రాజ్యసభ రెండు సవరణలతో ఆమోదించింది. దీంతో మళ్లీ లోక్‌సభ ముందుకొచ్చింది.

సవరణలు ప్రతిపాదించవద్దు: సోనియా
రాజ్యసభలో జీఎస్టీ బిల్లులకు ఎలాంటి సవరణలనూ ప్రతిపాదించకూడదని బుధవారం పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇతర విపక్షాలు తెచ్చే సవరణలకు మద్దతిచ్చే అవకాశముందని సమాచారం. దీనిపై గురువారం జరిగే సమావేశంలో పార్టీ నేతలు నిర్ణయం తీసుకోనున్నారు.   

ఈవీఎంలపై రాజ్యసభలో రగడ
ఈవీఎంలను బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ట్యాంపర్‌ చేస్తున్నారని విపక్షాలు రాజ్యసభలో ఆరోపించాయి. వచ్చే ఎన్నికలను బ్యాలట్‌ పేపర్లతో నిర్వహించాలని డిమాండ్‌ చేశాయి. విపక్ష ఆరోపణలను ప్రభుత్వం గట్టిగా తోసిపుచ్చింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలతో సభ దద్దరిల్లింది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి.. ప్రభుత్వం దగా చేస్తోందని మండిపడ్డారు.

మధ్యప్రదేశ్‌లో ఈవీఎంలను పరీక్షిస్తున్నప్పుడు ఓట్లు ఎవరికి వేసినా బీజేపీకే పడ్డాయని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ప్రస్తావించారు. సభాకార్యక్రమాలను నిలిపేసి ఈ అంశంపై చర్చించాలని కాంగ్రెస్, ఎస్పీ నాలుగు నోటీసులు ఇవ్వగా, అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం దగాకోరు అని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని బీఎస్పీ చీఫ్‌ మాయావతి ఆరోపించారు. దీనిపై అధికార సభ్యులు గొడవ చేశారు.

ఆమె దేశ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అవమానించారని మంత్రి నక్వీ అన్నారు. బీజేపీ ఓడిన 2004, 2009 సార్వత్రిక ఎన్నికలు, ఇటీవలి బిహార్, పంజాబ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఈవీఎంలతోనే నిర్వహించారని, అప్పుడు కాంగ్రెస్‌కు ఏ అభ్యంతరమూ కనిపించలే దన్నారు. మాయావతి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ ప్రకటించారు. ఈ అంశాన్ని పరిశీలించాల్సింది ఈసీనే అంటూ సభను వాయిదా వేశారు.

లోక్‌సభకు ‘ఓబీసీ’ బిల్లు
వెనకబడిన వర్గాల కోసం రాజ్యాంగ బద్ధ అధికారాలతో సాధికారిక కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగ(123వ సవరణ) బిల్లును సామాజిక న్యాయ మంత్రి థావర్‌చంద్‌ గెహ్లాట్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుత వెనకబడిన వర్గాల జాతీయ కమిషన్‌ను రద్దు చేసేందుకు మరో బిల్లునూ సభ ముందుంచారు. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్‌) అధీకృత మూలధనాన్ని ఆరు రెట్లు పెంచి రూ.30వేల కోట్లుకు చేర్చేందుకు ప్రతిపాదించిన నాబార్డ్‌ సవరణ బిల్లును–2017ను ప్రభుత్వం సభ ముందుంచింది. 

>
మరిన్ని వార్తలు