గుజరాత్ సీఎం మరో సంచలన నిర్ణయం

5 Aug, 2016 18:13 IST|Sakshi
గుజరాత్ సీఎం మరో సంచలన నిర్ణయం

సూరత్: గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత ఆనందీబెన్ పటేల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మరణాంతరం తన శరీరాన్ని దానం చేయాలని ఆమె కోరారు. సూరత్ యూనివర్శిటీ క్యాంపస్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆనందీబెన్ ఈ విషయాన్ని ప్రకటించారు.

అవయవాలు దానం చేసిన వారి కుటుంబ సభ్యులను, ఇందుకు సేవలందిస్తున్న వైద్యులను ఆనందీబెన్ సన్మానించారు.  ఓ ఎన్జీవో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 70 ఏళ్లు రాగానే మనం ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని భావిస్తామని, కానీ అంతేకంటే ఎక్కువ వయసులో కూడా డాక్టర్లు అవయమార్పిడి ఆపరేషన్లు విజయవంతం చేయడానికి కృషిచేస్తున్నారని ప్రశంసించారు.

పలుకార్యక్రమాల్లో పాల్గొన్న ఆనందీబెన్ రాజకీయ విషయాలను మాత్రం ప్రస్తావించలేదు. గత బుధవారం వయోభారం కారణంగా గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆనందీబెన్ రాజీనామాను గుజరాత్ గవర్నర్ ఆమోదించారు.  కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేవరకు పదవిలో కొనసాగాల్సిందిగా గవర్నర్ ఆమెను కోరారు.
 

మరిన్ని వార్తలు