ఆ 13,860 కోట్లు నావి కావు

4 Dec, 2016 02:31 IST|Sakshi
ఆ 13,860 కోట్లు నావి కావు

నేను మధ్యవర్తినే..  ఐటీ అధికారులతో గుజరాత్ వ్యాపారి మహేశ్
 
 అహ్మదాబాద్: నల్లధనం మార్చుకునేందుకు కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు తనను పావుగా వాడుకున్నారంటూ గుజరాత్ వ్యాపారవేత్త మహేష్ షా శనివారం వెల్లడించాడు. ఆదాయం వెల్లడి పథకంలో భాగంగా రూ. 13,860 కోట్లు ప్రకటించిన మహేష్ షా... చివరికి మొదటి వారుుదా కట్టకుండా చేతులెత్తేసి ఐటీ అధికారులకు షాక్ నిచ్చాడు. నవంబర్ 29 నుంచి పరారీలో ఉన్న షా ... చివరికి తనంతట తానే అహ్మదాబాద్‌లో ప్రత్యక్షమయ్యాడు. శనివారం అతనిని ఐటీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అంతకముందుకు ఒక టీవీ చానల్‌లో మాట్లాడుతూ కొందరి ఒత్తిడి మేరకే ఈ పని చేశానని, సొమ్ము తనదిగా ప్రకటిస్తే కమిషన్ ఇస్తానంటూ వారు వాగ్దానం చేశారని షా పేర్కొన్నాడు.  ఐడీఎస్ పథకం కింద ఎవరి డబ్బైతే వెల్లడించానో... వారు చివరి నిమిషంలో వెనక్కి తగ్గారని, అందుకే మొదటి వారుుదా కట్టలేకపోరుునట్లు చెప్పాడు. చేసిన తప్పును తెలుసుకున్నానని, ఐటీ విభాగం విచారణ అనంతరం అన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తానన్నాడు.

 పాలు, కేబుల్ బిల్లుకు డబ్బుల్లేవు కానీ...
 స్వచ్ఛంద నల్లధనం వెల్లడి పథకం సమయంలో రూ.13,860 కోట్ల నల్లధనాన్ని వెల్లడించిన షా అతి సాధారణ జీవితం గడిపేవాడనీ, పాలు, కూరగాయలకు కూడా అప్పు ఉన్నాడని తెలిసి ఐటీ శాఖ అధికారులు నివ్వెరపోయారు. షా అహ్మదాబాద్‌లో స్థిరాస్థి వ్యాపారం చేసేవాడు. అతి సాధారణ జీవితం గడిపే షా ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోవాలలతో బేరమాడేవాడు. పాలుకు రూ.8,000, కూరగాయలకు రూ.5,800 అప్పు ఉన్నాడు. బిల్లు కట్టకపోవడంతో కేబుల్ టీవీ కనెక్షన్ కూడా తొలగించారు.

అలాంటి వ్యక్తి ఐడీఎస్‌లో తన వద్ద రూ.13,860 కోట్ల లెక్క చూపని డబ్బు ఉందంటూ ఆదాయపు పన్ను శాఖకు సమాచారమిచ్చాడు. ఆ డబ్బుకు సంబంధించి నవంబర్ 30 లోపు రూ.1,560 కోట్లు తొలి వారుుదాగా పన్ను రూపంలో చెల్లించాలి. ఆ డబ్బు కట్టలేకపోవచ్చని ఐటీ శాఖకు సమాచారం రావడంతో మహేష్, ఆయన స్నేహితుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు దాడులు చేశారు. దాడుల్లో మహేష్ ఇంట్లో రూ.29,000 మాత్రమే దొరికింది.  మహేష్ ఆర్థిక పరిస్థితి ఏంటో తనకు సరిగా తెలీదని ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ తెహ్ముల్ సేత్నా చెప్పడం గమనార్హం. మహేష్ ఐదు సెల్‌ఫోన్లను వాడేవాడని, తరచూ నంబర్లు మార్చేవాడని సమాచారం. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీలకు తరచూ వెళ్తూ ఉండేవాడనీ, విమానాశ్రయానికి మాత్రం రిక్షాలో వెళ్లేవాడని తెలిసింది.