ఇండియాపై నా సత్తా చూపిస్తా: పాక్‌ క్రికెటర్‌

25 May, 2017 10:15 IST|Sakshi
ఇండియాపై నా సత్తా చూపిస్తా: పాక్‌ క్రికెటర్‌

కరాచీ: చాంపియన్స్‌ ట్రోఫీలో బద్ధ విరోధి భారత్‌పై తన సత్తా ఏంటో చాటేందుకు సిద్ధంగా ఉన్నానని పాకిస్థాన్‌ క్రికెటర్‌ హారిస్‌ సోహైల్‌ తెలిపాడు. ఉమర్‌ అక్మల్‌ ఫిట్‌నెస్‌ టెస్టులో ఫెయిలవ్వడంతో అతని స్థానంలో పాకిస్థాన్‌ జట్టులోకి సోహైల్‌ వచ్చాడు.

అన్‌ఫిట్‌ అని తేలడంతో అక్మల్‌ను ఇంగ్లండ్‌ నుంచి అర్ధంతరంగా వెనుకకు పిలిపించిన సంగతి తెలిసిందే. అనంతరం నిర్వహించిన ఫిట్‌నెస్‌ టెస్టుల్లో అతను ఫెయిలవ్వడంతో అతన్ని జట్టు నుంచి తప్పించారు. ప్రస్తుతం చాంపియన్స్‌ ట్రోఫీ సన్నాహాల్లో భాగంగా ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో పాక్‌ జట్టు ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది.

2015 మేలో జింబాబ్వే పర్యటనలో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 28 ఏళ్ల సోహైల్‌ తిరిగి జాతీయ జట్టులోకి అడుగుపెట్టడంతో సంతోషం వ్యక్తం చేశాడు. ‘జట్టు విజయం కోసం నా శాయశక్తులా కృషి చేస్తాను. ప్రతి ఆటగాడు కూడా భారత్‌పై బాగా  ఆడాలని కోరుకుంటాడు. భారత్‌తో మ్యాచ్‌లో నాకు ఆడేందుకు అవకాశం వస్తే.. తప్పకుండా నా ఉత్తమ ఆటతీరు చూపేందుకు ప్రయత్నిస్తా’ అని సోహైల్‌  ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ పత్రికతో చెప్పాడు.

చాంపీయన్స్‌ ట్రోఫీలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాయాదుల సమరానికి రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జూన్‌ 4న బర్మింగ్‌హామ్‌ వేదికగా భారత్‌-పాకిస్థాన్‌ తలపడుతుండటంతో ఇప్పుడు ఇరుదేశాల్లోని క్రికెట్‌ ప్రేమికుల దృష్టి మ్యాచ్‌పైనే నెలకొని ఉంది.
 

మరిన్ని వార్తలు