మరో 7 కేంద్రాలు ఏర్పాటు చేయండి

27 Aug, 2015 03:32 IST|Sakshi

సీసీఐ సీఎండీ బీకే మిశ్రాకు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి కొనుగోలుకు గత ఏడాది ఏర్పాటు చేసిన 83 కేంద్రాలతో పాటు అదనంగా మరో 7 కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అధికారులకు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం సచివాలయంలో సీసీఐ సీఎండీ బీకే మిశ్రాతో మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. సంస్థ వరంగల్, ఆదిలాబాద్ జనరల్ మేనేజర్లు, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్ శాఖ డైరక్టర్ డాక్టర్ శరత్ సమావేశంలో పాల్గొన్నారు.

అక్టోబర్ పది నుంచి 30వ తేదీలోపు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గత ఏడాది పత్తి కొనుగోలు సందర్భంగా ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద మార్కెటింగ్ శాఖ తరఫున  సిబ్బందిని నియమించి, కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడాలన్నారు. జిల్లాలవారీగా పత్తి రైతులను గుర్తించి, వారి వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని ఆదేశించారు.

కొనుగోలు చేసిన పత్తికి 48 గంటల లోపు రైతుల ఖాతాలోకి ఆన్‌లైన్‌లో డబ్బులు జమ చేయాలని సీసీఐ అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ముందు హమాలీలతో సమావేశాలు నిర్వహించాలని, సీసీఐ అధికారులతో కలసి తూకపు యంత్రాలు, మౌలిక సౌకర్యాలను పరిశీలించాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు.  పత్తిలో తేమ 12 శాతానికి తక్కువ వుండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై మార్కెటింగ్ శాఖ అధికారులు విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది కేంద్రం పత్తికి రూ.4,100 కనీస మద్దతుధర ప్రకటించిందని సీసీఐ సీఎండీ బీకే మిశ్రా వెల్లడించారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా