ఆ బైక్‌లను నడపొద్దు.. వెనక్కి ఇచ్చేయండి

4 Jun, 2017 07:48 IST|Sakshi
ఆ బైక్‌లను నడపొద్దు.. వెనక్కి ఇచ్చేయండి

- 60వేల వాహనాలను రీకాల్‌ చేసిన హార్లే డేవిడ్సన్‌

చికాగో:
ప్రపంచ ప్రఖ్యాత మోటార్‌ సైకిళ్ల ఉత్సత్తిదారు హార్లే డేవిడ్సస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడైపోయిన పలు మోడళ్ల ఇంజన్లలో లోపాలున్నట్లు తెలిపింది. ఆ లోపం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున దాదాపు 60 వేల మోటార్‌సైకిళ్లను రీకాల్‌ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. విస్కాన్సిస్‌(అమెరికా)లోని సంస్థ ప్రధాన కార్యాలయం ఈ మేరకు తన డీలర్లు, కస్టమర్లకు సమాచారం అందించింది. మంగళవారం నుంచి బైక్‌లు వెనక్కి తీసుకుంటున్నట్లు సంస్థ పేర్కొంది.

ఏమిటి లోపం?: ఇంజిన్‌ ఆయిల్‌ కూలర్‌లైన్ల క్లాంపులు సరిగా బిగించని కారణంగా ఆయిల్‌ లీక్‌ అవుతోందని, తద్వారా వెనుక చక్రం పట్టుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హార్లే సంస్థ తెలిపింది. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు తొమ్మిది ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, ఒక బైకర్‌ గాయపడ్డాడని చెప్పంది. నిజానికి ఫిర్యాదులేవీ రానప్పటికీ, వినియోగదారుల క్షేమం దృష్ట్యా బైక్‌లను రీకాల్‌ చేశామన్న సంస్థ.. ఆయా షోరూమ్‌లలో క్లాంపులను సరిగా బిగించి ఇస్తామని, దీనికి ఎలాంటి చార్జీ వసూలు చేయబోమని పేర్కొంది.

ఏయే మోడళ్లలో లోపాలున్నాయి? 2016 జులై 2 నుంచి 2017 మే 9 వరకు తయారుచేసిన తొమ్మిది మోడళ్లలో ఆయిల్‌ లీకేజీ లోపం ఉన్నట్లు హార్లే డేవిడ్సన్‌ తెలిపింది. ఆ మోడళ్లు ఇవే.. 1.ఎలక్ట్రా గ్లైడ్‌ ఆల్ట్రా క్లాసిక్‌, 2.పోలీస్‌ ఎలక్ట్రా గ్లైడ్‌, 3.పొలీస్‌ రోడ్‌ కింగ్, 4.రోడ్‌ కింగ్‌, 5.రోడ్‌ కింగ్‌ స్పెషల్‌, 6.స్ట్రీట్‌ గ్లైడ్‌, 7.స్ట్రీట్‌ గ్లైడ్‌ స్పెషల్‌, 8.రోడ్‌ గ్లైడ్‌, 9.రోడ్‌ గ్లైడ్‌ స్పెషల్‌. ఈ మోడళ్లను కొనుగోలు చేసిన కస్టమర్లు మంగళవారం నుంచి సమీపంలోని షోరూమ్‌లను సంప్రదించాల్సిఉంటుంది.

మరిన్ని వార్తలు