మందు.. ఇక కాస్ట్లీ గురూ!

6 Mar, 2017 08:25 IST|Sakshi
మందు.. ఇక కాస్ట్లీ గురూ!

ఎక్కడైనా మందు మామూలుగానే దొరుకుతుందేమో గానీ, హరియాణా వెళ్లారంటే మాత్రం మామూలు కంటే అదనంగా డబ్బులు జేబులో పెట్టుకుని వెళ్లాల్సిందే. ఎందుకంటే, అక్కడ రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల మద్యం సీసాల ధరలను 20 శాతం చొప్పున పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని బ్రాండ్లకు చెందిన స్వదేశీ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్), విదేశీ మద్యం అన్నింటికీ ఈ ధరల పెంపు వర్తిస్తుంది. ఇందుకు గాను 2017-18 సంవత్సరానికి సంబంధించిన కొత్త ఎక్సైజ్ పాలసీని రాష్ట్ర ఎక్సైజ్, పన్నుల శాఖ మంత్రి కెప్టెన్ అభిమన్యు విడుదల చేశారు. దీనివల్ల రీటైలర్ల ఆదాయం బాగా పెరుగుతుందని అంటున్నారు.

అంతేకాదు.. గుర్‌గావ్, ఫరీదాబాద్ ఎక్సైజ్ జోన్లోల నివసించేవాళ్లు పబ్‌లలో తాగాలంటే మరింత ఎక్కువ వదిలించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, అక్కడి పబ్‌లు, బార్ల లైసెన్సు ఫీజులను ఏడాదికి రూ. 12 లక్షల నుంచి రూ. 15 లోలవరకు పెంచారు. దీంతోపాటు ఇతర పన్నులు అదనం. ఇప్పుడు మద్యం దుకాణాల వాళ్లు తాము ఏ రకం మద్యం కావాలనుకుంటే దాన్ని అమ్ముకోవచ్చు. జాతీయ రహదారుల వెంబడి మద్యం అమ్మకాలను నిషేధించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. ఇక నగరాలు, పట్టణాల్లో ఎక్కడ అమ్ముకుంటారో ఆ ప్రదేశం ఎంపిక నిర్ణయాన్ని వ్యాపారులకే ప్రభుత్వం వదిలేసింది. దాన్ని బట్టి చూస్తే.. మద్యం అమ్మకందారులు ఇతరులకు కూడా అవకాశం ఇవ్వచ్చు. అంటే ఒకరకంగా ఇవి అధికారిక బెల్టుషాపుల లాంటివన్న మాట.

గత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ నుంచి రూ. 4900 కోట్ల ఆదాయం రావాలని లక్ష్యం పెట్టుకోగా, కేవలం రూ. 4071 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో ఈసారి కాస్త కోటా పెంచి రూ. 5,500 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని విధించారు. లైసెన్సు ఫీజులతో పాటు కొన్ని పన్నుల ద్వారా ఈ అదనపు ఆదాయం వస్తుందని కెప్టెన్ అభిమన్యు అంటున్నారు. ఒక్కో లైసెన్సుకు తోడు అదనంగా రెండు బెల్టుషాపులు నిర్వహించుకోడానికి అనుమతి ఇవ్వడంతో.. ఇప్పటివరకు ఉన్న 3500 మద్యం షాపులు కాస్తా ఇప్పుడు 9వేల వరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు