తలకిందులుగా చెట్లు ఎక్కేస్తాడు..!

6 May, 2017 11:35 IST|Sakshi
తలకిందులుగా చెట్లు ఎక్కేస్తాడు..!

న్యూఢిల్లీ: పక్క కొమ్మలు లేకుండా నిటారుగా ఉన్న చెట్టును ఎక్కడం అందరికీ సాధ్యంకాదు. సాధన  ఉంటేనే సాధ్యం. అలాంటిది హరియాణాకు చెందిన 32 ఏళ్ల ముఖేష్ కుమార్‌ నేరుగా కాకుండా తలకిందులుగా చెట్లు ఎక్కుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తన అసాధారణ ప్రతిభతో గిన్నిస్ బుక్‌లో రికార్డు నెలకొల్పడంతో పాటు కుటుంబం కోసం కొంత డబ్బు సంపాదించాలని ఆశిస్తున్నట్టు ముఖేష్‌ చెప్పాడు. ప్రస్తుతం అతను భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

13 ఏళ్ల వయసు నుంచి ముఖేష్‌ తలకిందులుగా చెట్లు ఎక్కడం ప్రారంభించాడు. అందరూ నిటారుగా చెట్లు ఎక్కుతారని, తలకిందులుగా ఎందుకు ఎక్కరాదన్న ఆలోచన వచ్చిందని, దీంతో వినూత్న పద్ధతిలో ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. పలుమార్లు గాయపడినా, తన అలవాటును మార్చుకోలేదని తెలిపాడు. మొదట్లో తలకిందులుగా రెండు లేదా మూడు అడుగులు మాత్రమే చెట్లు ఎక్కగలిగేవాడినని, సాధన చేసి పొడవాటి చెట్లను ఎక్కడం నేర్చుకున్నానని చెప్పాడు. ఎప్పుడూ పొడవాటి చెట్లను ఎక్కేందుకు ఆసక్తి చూపుతానని, అంతేగాక తక్కువ సమయంలో ఎక్కేందుకు సాధన చేస్తున్నానని ముఖేష్‌ తెలిపాడు. చెట్లను ఎక్కేటపుడు కంటే వేగంగా కిందకు దిగుతానని చెప్పాడు. 50 అడుగుల ఎత్తున్న చెట్లను ముఖేష్‌ ఐదు నిమిషాల్లోపే ఎక్కేస్తాడు.
 

మరిన్ని వార్తలు