కోహ్లి రికార్డుకు సఫారీ ఎసరు

30 May, 2017 08:42 IST|Sakshi
కోహ్లి రికార్డుకు సఫారీ ఎసరు

వన్డేలలో వేగంగా ఏడువేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న రికార్డు చెరిగిపోయింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ హాషిమ్‌ ఆమ్లా కోహ్లిని అధిగమించి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో, ఫైనల్‌ వన్డేలో అతను ఏడువేల పరుగుల మైలురాయిని అధిగమించాడు.

గతంలో ఈ రికార్డు సఫారీ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉండటం గమనార్హం. డివిలియర్స్‌ 166 ఇన్నింగ్స్‌లలో ఏడువేల పరుగులు పూర్తిచేయగా, కోహ్లి 161 ఇన్నింగ్స్‌లలోనే ఈ మైలురాయిని అధిగమించి వన్డేల్లో వేగంగా 7వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు మరో సఫారీ బ్యాట్స్‌మన్‌ ఆమ్లా 151 ఇన్నింగ్స్లలోనే ఈ మైలురాయిని అందుకొని ఈ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. నిజానికి ఈ రికార్డు భారత జట్టు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ పేరిట చాలాకాలం కొనసాగింది. గంగూలీ 174 ఇన్నింగ్స్‌లలోనే 7వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న వెస్టిండీస్‌ లెజండ్‌ బ్రియాన్‌ లారా 183 ఇన్నింగ్స్ల్‌లో ఈ క్లబ్బులో చేరాడు.

 ఈ వారమే చాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభంకానున్న నేపథ్యంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్‌ జట్టు సొంతం చేసుకుంది. మూడో వన్డేను దక్షిణాఫ్రికా గెలుపొందినప్పటికీ, మొదటి రెండు వన్డేలలో ఇంగ్లండ్‌ గెలువడంతో సిరీస్‌ ఆ జట్టును వరించింది. మూడో వన్డేలో 55 పరుగులు చేసిన ఆమ్లా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

 

మరిన్ని వార్తలు