హవాయి, కాలిఫోర్నియాలకూ సునామీ హెచ్చరికలు!

17 Sep, 2015 17:08 IST|Sakshi
హవాయి, కాలిఫోర్నియాలకూ సునామీ హెచ్చరికలు!

చిలీ తీరంలో సంభవించిన భూకంపం ప్రభావంతో కాలిఫోర్నియా తీరప్రాంతాలతో పాటు హవాయ్ దీవులకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దాంతో ఈ రెండు ప్రాంఆతల్లో తీరప్రాంతాల వెంబడి ఉండేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. హవాయి దీవుల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తొలుత గట్టిగా చెప్పింది. అయితే ఆ తర్వాత మాత్రం మళ్లీ అధికారులు ఇక్కడ మరీ అంత తీవ్రమైన సునామీ రాకపోవచ్చని తెలిపారు.

కానీ సముద్రమట్టం ప్రమాదకరంగా పెరగొచ్చని, తీరానికి దగ్గర్లో ఉండేవాళ్లకు ఈ కెరటాలు ముప్పు తేవొచ్చని తెలిపారు. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 6.30 ప్రాంతానికి హవాయి దీవులపై ప్రభావం కనిపించే అవకాశం ఉందని సునామీ హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది. ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, సునామీ కెరటాలు బలంగా రావొచ్చని కోస్ట్గార్డ్ దళాలు కూడా తెలిపాయి.

కాలిఫోర్నియాకు కూడా ఇలాంటి హెచ్చరికలే వచ్చాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటల సమయంలో మొదటి సునామీ కెరటం కాలిఫోర్నియా దక్షిణ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆరంజ్ కౌంటీ నుంచి శాన్ లూయిస్ ఒబిస్పో కౌంటీ వరకు గల తీరప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

మరిన్ని వార్తలు