జంట పేలుళ్ల నిందితుడు షర్ఫుద్దీన్కు చుక్కెదురు

20 Nov, 2015 04:11 IST|Sakshi
జంట పేలుళ్ల నిందితుడు షర్ఫుద్దీన్కు చుక్కెదురు

* బెయిల్ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
* బెయిలిస్తే తిరిగి పట్టుకోవడం కష్టం
* హైకోర్టుకు నివేదించిన అదనపు పీపీ
* ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్, గోకుల్ ఛాట్ వద్ద బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు ఫరూక్ షర్ఫుద్దీన్ తర్కాష్ అలియాస్ ఫరూక్ తర్కాష్ అలియాస్ అబ్దుల్లా బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2007, ఆగస్టు 25నలుంబినీ పార్క్, గోకుల్ ఛాట్ వద్ద రెండు బాంబు పేలుళ్లు జరిగాయి.

 

లుంబినీ పార్క్ ఘటనలో 12 మంది మరణించగా, 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గోకుల్ ఛాట్ వద్ద 32 మంది చనిపోగా, 47 మందికి గాయాలయ్యాయి. ఇదే సమయంలో దిల్‌సుఖ్‌నగర్ ఫుట్‌ఓవర్ బ్రిడ్జి కింద పెట్టిన రెండు బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈ మూడు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తరువాత దర్యాప్తును అక్టోపస్‌కు బదిలీ చేశారు. పేలుళ్ల అనంతరం ముంబైలో తలదాచుకున్న ఉగ్రవాదులను అక్టోపస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

 

వీరిలో తర్కాష్‌ను 2009లో పీటీ వారెంట్‌పై ముంబై నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం తర్కాష్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకున్నాడు. ఈ పిటిషన్లను వ్యతిరేకిస్తూ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి వాదనలు వినిపించారు. నిందితుడిపై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ కేసుపై కింది కోర్టులో విచారణ కూడా ప్రారంభం కాలేదని, ఇప్పుడు అతనికి బెయిల్ ఇస్తే మళ్లీ పట్టుకోవడం కష్టసాధ్యమవుతుందన్నారు. అంతేకాక బెయిల్‌పై విడుదలైన తరువాత సాక్ష్యాలను తారు చేయడం, సాక్షులను బెదిరించడం వంటి చేయడంతో పాటు ఇండియన్ ముజాహిద్దీన్‌తో కలసి ఉగ్ర కార్యకలాపాలకు తిరిగి పాల్పడే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ ఇలంగో బెయిల్ కోసం తర్కాష్ దాఖలు చేసుకున్న పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు