హెచ్‌సీఎల్ టెక్ బంపర్ ఫలితాలు

17 Jan, 2014 01:08 IST|Sakshi
హెచ్‌సీఎల్ టెక్ బంపర్ ఫలితాలు

 న్యూఢిల్లీ: మార్కెట్ అంచనాలను మించుతూ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అక్టోబర్-డిసెంబర్(క్యూ2)లో భేషైన పనితీరును ప్రదర్శించింది. నికర లాభం 58%పైగా ఎగసి రూ. 1,496 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది ఇదే కాలం(అక్టోబర్-డిసెంబర్’12)లో రూ. 944 కోట్లను మాత్రమే ఆర్జించింది. ఇదే కాలానికి ఆదాయం కూడా 30% జంప్‌చేసి రూ. 8,184 కోట్లకు చేరింది. గతంలో రూ. 6,278 కోట్ల ఆదాయం నమోదైంది. కంపెనీ జూలై-జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. ఈ బాటలో ప్రకటించిన క్యూ2 కన్సాలిడేటెడ్ ఫలితాలివి.
 
 కాగా, 2013 జనవరి-డిసెంబర్ కాలంలో మొత్తం 5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించినట్లు కంపెనీ సీఈవో అనంత్ గుప్తా పేర్కొన్నారు. ఇది కంపెనీ చరిత్రలో తొలిసారి కాగా, యూరో దేశాల నుంచి ఐటీ సేవలకు కనిపించిన డిమాండ్‌కుతోడు, ఫైనాన్షియల్, ఇన్‌ఫ్రా, తయారీ విభాగాలలో లభించిన భారీ కాంట్రాక్ట్‌లు ఉత్తమ పనితీరుకు దోహదపడినట్లు కంపెనీ చైర్మన్ శివ్ నాడార్ పేర్కొన్నారు. 2013లో ఇన్‌ఫ్రా, తయారీ, ఫైనాన్షియల్ విభాగాలు ఒక్కొక్కటీ 1.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అధిగమించాయని గుప్తా వివరించారు. కాగా, క్యూ2లో డాలర్ల రూపేణా కంపెనీ లాభం 39% పుంజుకుని 24.2 కోట్ల డాలర్లను తాకగా, ఆదాయం 14.5% పెరిగి 132 కోట్ల డాలర్లయ్యింది. క్యూ2లో సహజంగానే పనితీరు మందగిస్తుందని, అయినప్పటికీ నిర్వహణ సామర్థ్యం, వ్య యాల కట్టడి తదితర అంశాల నేపథ్యంలో మంచి పనితీరును చూపగలిగామని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌వో) అనిల్ చనానా పేర్కొన్నారు.
 
 మరిన్ని విశేషాలివీ...

  • సర్వీసుల రంగంలో 15 డీల్స్‌ను చేజిక్కించుకుంది. ఫార్చ్యూన్ 500 కంపెనీల నుంచి లభించిన ఆర్డర్లలో ఫైనాన్షియల్, తయారీ విభాగాలు 80 శాతం వరకూ వాటాను ఆక్రమిస్తున్నాయి.
  • డిసెంబర్ చివరినాటికి కంపెనీ వద్ద నగదు, తత్సంబంధ నిల్వల విలువ 13.51 కోట్ల డాలర్లుగా నమోదైంది.
  • మొత్తం 844 మంది క్లయింట్లను కలిగి ఉన్న కంపెనీలో సిబ్బంది సంఖ్య 88,332కు చేరింది. స్థూలంగా 7,593 మంది, నికరంగా 1,136 మంది ఉద్యోగులు కొత్తగా జత కలిశారు.
     

మరిన్ని వార్తలు