10% పెరిగిన హెచ్‌డీఎఫ్‌సీ లాభం

30 Apr, 2015 00:33 IST|Sakshi

ఒక్కో షేర్‌కు రూ.13 డివిడెండ్
ముంబై : గృహ రుణాల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ 2014-15 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 2,646 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో లాభం రూ. 2,415 కోట్లతో పోలిస్తే 9.6 శాతం అధికం. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ. 12,266 కోట్ల నుంచి రూ. 14,726 కోట్లకు పెరిగింది. 2014-15కి గాను రూ. 2 ముఖ విలువ గల షేరుపై రూ. 13 చొప్పున తుది డివిడెండు ఇవ్వాలని సంస్థ బోర్డు ప్రతిపాదించింది. దీంతో మధ్యంతర డివిడెండ్ రూ. 2 కూడా కలుపుకుంటే మొత్తం రూ.

15 మేర లభించినట్లవుతుంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నికర లాభం 10.2 శాతం వృద్ధితో రూ. 8,763 కోట్లకు చేరగా, ఆదాయం రూ. 40,753 కోట్ల నుంచి రూ. 48,316 కోట్లకు పెరిగింది. ప్రత్యేక రిజర్వ్‌లపై కట్టాల్సిన పన్ను కోసం రూ. 384 కోట్లు పక్కన పెట్టినట్లు హెచ్‌డీఎఫ్‌సీ వైస్ చైర్మన్ కేకి మిస్త్రీ తెలిపారు.

కాగా, బీమా విభాగం హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో భాగస్వామ్యం ఉన్న స్టాండర్డ్ లైఫ్ తన వాటాలను పెంచుకున్నాకే సంస్థను లిస్టింగ్ చేయనున్నట్లు మిస్త్రీ వివరించారు. ప్రస్తుతం ఈ జేవీలో హెచ్‌డీఎఫ్‌సీకి 71.42% వాటాలు, బ్రిటన్‌కు చెందిన స్టాండర్డ్ లైఫ్‌కి 26% వాటాలు ఉన్నాయి.
 ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ షేరు 2 శాతం పైగా క్షీణించి రూ. 1,202 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు