కాఫీ డేలో తిట్టాడు.. అందుకే కొట్టాను!

30 Mar, 2017 09:03 IST|Sakshi
కాఫీ డేలో తిట్టాడు.. అందుకే కొట్టాను!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో కేఫ్ కాఫీ డే (సీసీడీ)లో పనిచేసే ఒక యువతి.. అక్కడకు వచ్చిన యువకుడిని చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. అయితే, తెరమీద కనిపించేది అంతా నిజమే కాదని.. తెరవెనక ఉన్న వాస్తవాలు కూడా చూడాలంటూ ఆ అబ్బాయి మీదే పోలీసులు కేసు నమోదు చేశారు. కాఫీడే అమ్మాయిని అసభ్య పదాలతో దూషించడం, బెదిరించడమే అందుకు కారణం. ఢిల్లీ నేషనల్ లా యూనివర్సిటీలో చదువుతున్న అర్పణ్ వర్మ తనకున్న లా పరిజ్ఞానాన్ని అంతా ఉపయోగించి, కాఫీడేలో బొద్దింకలను చూపించినందుకు అక్కడి అమ్మాయి తనను కొట్టిందంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవ్వడంతో పెద్ద దుమారమే రేగింది.

అయితే, మూడు రోజుల తర్వాత.. జైపూర్ మనక్‌చౌక్ పోలీసు స్టేషన్‌లో కాఫీ డే అమ్మాయి ప్రియాంకా ప్రియదర్శిని ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వర్మ, మరో వ్యక్తి కలిసి హవామహల్ సమీపంలో ఉన్న కాఫీడే ఔట్‌లెట్‌కు వచ్చారు. అక్కడ వాళ్లు కొన్ని డ్రింకులు కావాలని ఆర్డర్ చేశారు. కానీ తమ వద్ద కేవలం కాఫీ మాత్రమే ఉందని ప్రియాంక చెప్పడంతో వాళ్లకు కోపం వచ్చి నోటికి వచ్చినట్లల్లా ఆమెను తిట్టారు. తనను 'బిచ్' అని కూడా తిట్టారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. గట్టిగా మాట్లాడితే తనపై అత్యాచారం చేస్తామని కూడా బెదిరించారని వాపోయింది. అప్పటికి కాఫీ డే నుంచి వెళ్లిపోయినా.. కాసేపటి తర్వాత మళ్లీ వచ్చి ఎక్కడెక్కడ బొద్దింకలు ఉన్నాయో వెతికి మరీ వాటిని వీడియో తీశారని తెలిపింది. ఆ తర్వాత బొద్దింకలు కనిపించే విషయాన్ని ముందు చూపించి, ఆ తర్వాత ప్రియాంక తనను కొట్టిన క్లిప్పింగ్ జతచేసి వీడియో రూపొందించాడు. దాన్ని వాట్సప్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా విపరీతంగా సర్క్యులేట్ చేశాడు. ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్పణ్ వర్మపై మనక్ చౌక్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు