ఐపీఎల్‌ బెట్టింగ్‌లే కొంపముంచాయి!

25 May, 2017 11:12 IST|Sakshi
ఐపీఎల్‌ బెట్టింగ్‌లే కొంపముంచాయి!

► భార్యాబిడ్డలకు నిద్రమాత్రలు, విషపు ఇంజెక్షన్ !
►హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబం ఆత్మహత్య కేసులో వెల్లడైన నిజం
►హత్య కేసుగా నమోదు


యలహంక: ఐపీఎల్ బెట్టింగ్లు కుటుంబాన్ని మింగేశాయి. అతను పోలీస్ హెడ్ కానిస్టేబుల్ విచ్చలవిడిగా బెట్టింగ్ వేశాడు. ఆ కారణంతోనే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేలా చేశాయి. బెట్టింగ్ ఒక సరదా. హద్దులు దాటి ఆడితే అదే సరదా ప్రాణాలు తీస్తుంది. ఇలాంటి సంఘటననే నగరంలో సంపిగేహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సీఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సుభాష్చంద్ర ఆరోగ్యం మెరుగ్గానే ఉందని చికిత్స అందిస్తున్న బాప్టిస్ట్ ఆసుపత్తి వైద్యురాలు ఇందిరా మీనన్ తెలిపారు.

ఈ ఘోరానికి మూలం ఐపీఎల్ బెట్టింగ్లేనని తెలుస్తోంది. అతని కుటుంబం ‘ఆత్మహత్యాయత్నం’ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు మరణించడం తెలిసిందే. మంగళవారం వెలుగు చూసిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్యకు యత్నించిన సుభాష్ మొదట భార్య  వీణ, పిల్లలు, మణి, పథ్విలకు నిద్రమాత్రలు వేశారు. వారు నిద్రలోకి జారుకోగానే విషపు ఇంజెక్షన్లను ఇచ్చాడని వైద్యపరీక్షలో తేలినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆ తరువాత సుభాష్ కూడా నిద్రమాత్రలు మింగి తాను కూడా విషాన్ని  ఇంజెక్ట్ చేసుకున్నాడు. విషం ధాటికి భార్య పిల్లు మరణించగా, ఇతడు కొనప్రాణంతో ఉండగా బంధువులు గమనించి ఆస్పత్రికి తరలించారు. విచారణలో వెలుగు చూసిన అంశాలతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు.

విచ్చలవిడిగా ఐపీఎల్‌ పందేలు
తాజాగా ముగిసిన ఐపీఎల్‌ క్రికెట్‌ టోర్నీలో బెట్టింగ్‌లే హెడ్‌కానిస్టేబుల్‌ సుభాష్‌ కుటుంబంలో ఘోరానికి కారణంగా తెలుస్తోంది. మ్యాచ్‌లు మొదలైన రోజు నుంచి బెట్టింగ్‌లకు పాల్పడుతున్న సుభాష్‌ చాలా మ్యాచ్ల్లో ఓడిపోవడంతో బాగా నష్టపోయాడు. అతని ఒత్తిడితో భార్య వీణ అప్పుడప్పుడూ ఇంటి నుంచి డబ్బులు తెచ్చేదని వారి బంధువులు చెబుతున్నారు. ఆదివారం పుణే,ముంబయి జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సుభాష్‌ రూ.15 లక్షలకు పుణె గెలుస్తుందని పందెం కాశాడని తెలిసింది.

అయితే పుణె ఓడిపోవడంతో బెట్టింగ్‌రాయుళ్లు డబ్బుల కోసం ఇతనిపై ఒత్తిడి తెచ్చారు. సుభాష్‌ బళ్లారిలో ఉన్న స్నేహితులు, బంధువులను అప్పులు అడగగా అంతమొత్తంలో ఇవ్వలేమంటూ సమాధానాలు రావడంతో అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. దీంతో భార్యా, పిల్లలకు విషమివ్వాలనే భయంకరమైన ఆలోచన తట్టి ఉంటుందని చెబుతున్నారు. ఇతడు తక్కువ మోతాదులో నిద్రమాత్రలు, విషాన్ని ఇంజెక్ట్‌ చేసుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడి ఉంటాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
 

మరిన్ని వార్తలు