హెడ్‌ కానిస్టేబుల్‌ పాట దుమ్మురేపుతోంది!

11 Sep, 2016 12:50 IST|Sakshi
హెడ్‌ కానిస్టేబుల్‌ పాట దుమ్మురేపుతోంది!

పంజాబీ జానపద గీతం 'కాలాచష్మా' ఇప్పుడు దేశమంతటా దుమ్మురేపుతోంది. నిజానికి ఈ పాట 1990లోనే వచ్చింది. కానీ, తాజాగా వచ్చిన 'బార్‌ బార్‌ దేఖో' సినిమాలో ఆ పాటను వాడుకోవడంతో దీనికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ పాట రాసిందో ఎవరో తెలుసా.. ఓ హెడ్‌ కానిస్టేబుల్‌. పంజాబ్‌ పోలీసుశాఖలో పనిచేస్తున్న అమ్రిక్‌ సింగ్‌ షెరా (43) ఈ పాటను రచించారు.

ఆ విషయం తెలిసి షాక్‌ తిన్నాను!
పంజాబ్‌లోని కపుర్తలా పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న షెరా తన పాట దేశమంతటా మార్మోగుతుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. అయితే, ఈ పాట సినిమాలో తీసుకున్నారనే విషయం చివరివరకు తనకు తెలియదని చెప్పారు. 'రెండు నెలల కిందట నా స్నేహితులు ఫోన్‌చేసి నీ 'కాలాచష్మా' పాట చానెళ్లలో వస్తున్నదని చెప్పారు. నాకు ఆనందంతోపాటు షాక్‌ కలిగింది. నాకు తెలియకుండా ఇదంతా జరిగింది' అని షెరా తెలిపారు. ఓ సిమెంట్‌ సంస్థ ప్రారంభోత్సవంలో ప్లే చేస్తామంటూ ముంబైకి చెందిన ఓ కంపెనీ తన పాట హక్కులను తీసుకున్నదని, అందుకు కేవలం రూ. 11వేలు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. సినిమాలో వాడుకుంటున్న విషయాన్ని తనకు చెప్పలేదన్నారు.

ఇలా వాడుకోవడంపై ఎవరిపట్ల తనకు కోపం లేదని చెప్పారు. 'ఈ సినిమా ఆడియో వేడుకకుగానీ, ఇతర వేడుకలకుగానీ ఎవరూ నన్ను ముంబైకి పిలువలేదు. ఈ వేడుకలకు వెళ్లాలని నేను అనుకున్నాను. పంజాబ్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి ఈ పాట రాశాడని అందరికీ తెలియజేయాలనుకున్నా' అని షెరా ఆవేదన వ్యక్తం చేశారు.

జలంధర్‌ సమీపంలోని తల్వాండీ గ్రామానికి చెందిన షెరా 15 ఏళ్ల వయస్సులో తొమ్మిదో తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ పాట రాశారు. తన పాటలను రికార్డు చేయాల్సిందిగా అప్పట్లో చాలామంది గాయకులను కలిశానని, కానీ ఎవరూ సహకరించలేదని షెరా గుర్తుచేసుకున్నారు. చాలాకాలం తర్వాత ఇంగ్లండ్‌లోని ఓ వేడుకలో గాయకుడు అమర్‌ అర్షి 'కాలాచష్మా' పాట పాడటంతో అది సూపర్‌ హిట్‌ అయిందని, దీంతో ఓ కంపెనీ ఈ పాటను రికార్డుచేసి మొదట ఇంగ్లండ్‌లో విడుదల చేసిందని, ఆ తర్వాత పంజాబ్‌లోనూ ఈ పాట మార్మోగిందని చెప్పారు.