హైదరాబాద్‌లో భారీ వర్షం

26 Sep, 2015 01:59 IST|Sakshi
హైదరాబాద్‌లో భారీ వర్షం

- కూలిన చెట్లు.. పొంగిన నాలాలు
 - గర్భిణికి తృటిలో తప్పిన ప్రమాదం  
 
 హైదరాబాద్: నగరాన్ని శుక్రవారం భారీ వర్షం ముంచెత్తింది. ఈదురు గాలులతో కురిసిన జోరు వాన దెబ్బకు నగరంలోని పలు ప్రాంతా ల్లో భారీ చెట్లు నేలకొరిగాయి. రోడ్లపై చెట్ల కొమ్మలు, వరద నీటితో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. గంటకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకట్లు అలముకున్నాయి. కాచిగూడ పోలీస్‌స్టేషన్ వద్దనున్న చెట్టు వేళ్లతో సహా కూలి నిలిపివున్న ఆటో, ఇండీ క్యాబ్‌పై పడింది. ఆటో పూర్తిగా ధ్వంసమయింది. క్యాబ్‌లో ఉన్న నిండు గర్భిణికి తృటిలో ప్రమాదం తప్పింది. గమనించిన పోలీసులు క్యాబ్‌పై కొమ్మలు తొలగించి గర్భిణిని రక్షించారు. నింబోలిఅడ్డా ప్రధాన రహదారి, కాచిగూడ రైల్వే స్టేషన్ బైపాస్‌రోడ్డు, బర్కత్‌పురాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రాంతం వర్షపు నీటితో చెరువును తలపించింది.
 
 ఫీవర్ ఆసుపత్రిలో విరిగిపడిన చెట్లు
 నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో రెండు భారీ చెట్లు కూలాయి. ఓ చెట్టు 8వ వార్డు షెడ్డుపై పడటంతో రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. రోగి అటెండెంట్‌పై రేకులు పడి కాలికి స్వల్ప గాయమైంది. వార్డులో ఉన్న మిగిలిన రోగులు కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
 

మరిన్ని వార్తలు