‘ఛీ.. కుక్క బతుకు’ అనే ముందు ఓమారు..

9 Jun, 2017 01:55 IST|Sakshi
‘ఛీ.. కుక్క బతుకు’ అనే ముందు ఓమారు..

ముందుగా విషయం చెప్పుకునే ముందు ఇప్పుడు చెప్పేవన్నీ మన ఇంట్లో ఉన్నాయో లేదో చెక్‌ చేసుకుందాం.. ఓ విలాసవంతమైన బంగ్లా.. అందులో అంతా ఆటోమెటిక్‌.. ఆహారం, నీరు అంతా ఆటోమెటిక్‌ వ్యవస్థ ద్వారా వస్తాయి. పెద్ద సైజు టీవీ, ఎండాకాలానికి ఏసీ, చలికాలానికి గానూ హీటర్‌ సిస్టం.. సాయంత్రం అయ్యేసరికి ఆటోమెటిక్‌గా వెలిగే లైట్లు.. ఇంటి ముందు చిన్నసైజు గార్డెన్, యజమానితో ‘మాట్లాడేందుకు’కాన్ఫరెన్స్‌ కాల్‌ సిస్టం.. ఇంకా చెప్పుకుంటే ఎన్నో.. ఇందులో మన వద్ద ఎన్నున్నాయి? తెల్లమొహం వేశారా.. మనుషులే అసూయపడే స్థాయిలో ఉండే సౌకర్యాలను కుక్కలకు కల్పిస్తామని ముందుకొచ్చింది బ్రిటన్‌కు చెందిన హెకేట్‌ వెరోనా సంస్థ.

కుక్క మనిషికి బెస్ట్‌ ఫ్రెండ్‌ కదా.. మరి అలాంటి కుక్క లైఫ్‌లో అంతా బెస్ట్‌గా ఉండకపోతే ఎలా అనే కాన్సెప్ట్‌తో వాటి కోసం ఇంధ్రభవనాలను నిర్మిస్తామని చెబుతోంది. వీటి విలువ తక్కువలో తక్కువ రూ.25.7 లక్షలు.. లగ్జరీగా కట్టించుకోవాలంటే రూ.1.28 కోట్లు! అందరూ నోరెళ్లబెడుతుంటే.. ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నిస్తున్నారు ఆ సంస్థ క్రియేటివ్‌ డైరెక్టర్‌ అలైస్‌ విలియమ్స్‌.

‘కుక్కలను ఓ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్న నేపథ్యంలో వాటికెందుకు ఓ విలాసవంతమైన భవనం ఉండకూడదు.. యజమానికి ఉంటే చాలా? ఆర్కిటెక్ట్‌లు కుక్కల కోసం ఇల్లు డిజైన్‌ చేయకూడదా?’అని అంటున్నారు. ఇప్పటికే కొందరు సంపన్నులు ఆర్డర్లు కూడా ఇచ్చారట. ఈ నెల నుంచే వాటి మీద పని ప్రారంభమవుతుంది. ఒక్కో భవనం తయారీకి 2 నుంచి 4 నెలల సమయం పడుతుంది. ఇకపై ఎవరైనా ‘ఛీ.. కుక్క బతుకు’ అనే ముందు ఓమారు ఆలోచించుకోవాల్సిందే.

మరిన్ని వార్తలు