హెల్మెట్ తప్పనిసరి చేద్దాం

6 Aug, 2015 01:39 IST|Sakshi
హెల్మెట్ తప్పనిసరి చేద్దాం

ద్విచక్రవాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలనే అంశం మరోసారి తెరపైకి వ చ్చింది. రోజురోజుకూ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిబంధనను తప్పనిసరి చేయాలని పోలీసు, రవాణా శాఖలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత చట్టం రూపొందిస్తున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఇది అమలవుతోంది. తాజాగా పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఆగస్టు ఒకటి నుంచి దీనిని అమలులోకి తెచ్చింది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా శిరస్త్రాణం ధరించడాన్ని తప్పనిసరి చేసే నిబంధనను అమలు చేయాలని తాజాగా పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సాధారణంగా హెల్మెట్ నిబంధన విషయంలో వాహనదారులు అయిష్టత చూపుతారు. హెల్మెట్ వాడకం అలవాటులేని వారు దాన్ని చిరాకుగా భావిస్తూ వెనకడుగు వేస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే అందుకు సుముఖంగా ఉన్నట్టు కనిపించటం లేదు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో.. రోడ్డు భద్రతపై రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇటీవలే జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది. ఈ సమయంలో హెల్మెట్ నిబంధనను రెండు శాఖలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. అయినా ఇప్పటి వర కు అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు.         
- సాక్షి, హైదరాబాద్
 
ఎన్నికల నేపథ్యంలో ఆచితూచి..
హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ అదనపు కమిషనర్‌గా పనిచేసిన ఓ అధికారి దాదాపు పదేళ్ల క్రితమే హెల్మెట్ ధారణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ అధికారి ఒత్తిడితో దాన్ని తప్పనిసరి చేస్తూ అమలు మొదలైంది. కానీ, వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటం, హెల్మెట్ కంపెనీల కోసం పోలీసులు హడావుడి చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇటీవల ప్రమాదాల సంఖ్య పెరగటం, దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతపై చర్చ జరుగుతున్న తరుణంలో పోలీసు, రవాణా శాఖలు మళ్లీ దీనిపై దృష్టి సారించాయి.

కానీ త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం దీనిపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నిబంధనపై వాహనదారుల్లో వ్యతిరేకత వస్తే.. అది ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే ఆందోళనే దీనికి కారణంగా తెలుస్తోంది. మరోవైపు దీనిని పట్టించుకోని పోలీసు శాఖ క్రమంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. అలాగే గత కొన్ని రోజులుగా హెల్మెట్ నిబంధనకు సంబంధించి చలానాలు విధించటాన్ని తీవ్రం చేసినట్టు సమాచారం.

సగటున నిత్యం 100కుపైగా చలానాలు విధిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. ‘రోడ్డు భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. వాహనదారుల రక్షణ దృష్ట్యా హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేయాలి. దాన్ని అమలు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం అనుమతివ్వడమే తరువాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నందున హెల్మెట్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
 
ముఖ్యమంత్రితో చర్చిస్తాం
రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి
‘హెల్మెట్ ధారణను తప్పనిసరి చేసే విషయంలో తుదినిర్ణయం తీసుకోలేదు. దీనిపై త్వరలో ముఖ్యమంత్రితో చర్చిస్తాం. అంతకుముందు పోలీసు, రవాణా శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తాం. ఆ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటాం’ అని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు.

మరిన్ని వార్తలు