రష్యాతో సైనిక సహకారం కట్

5 Mar, 2014 05:21 IST|Sakshi
రష్యాతో సైనిక సహకారం కట్

ఉక్రెయిన్‌పై సైనిక జోక్యానికి నిరసనగా అమెరికా ప్రతిచర్య
ఉక్రెయిన్‌కు రూ. 6 వేల కోట్ల ఇంధ న రాయితీ ప్యాకేజీ
కీవ్ చేరుకున్న అమెరికా మంత్రి
ఉక్రెయిన్ సరిహద్దులోని సైన్యాన్ని వెనక్కి పిలిచిన రష్యా

 
వాషింగ్టన్/మాస్కో: ఉక్రెయిన్ సంక్షోభం అంతర్జాతీయ సమస్యగా మారింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక జోక్యానికి నిరసనగా అమెరికా రష్యాతో సైనిక సహకారాన్ని నిలిపివేసింది. సైనిక విన్యాసాలు, భేటీలు, పర్యటనలను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్‌కు వంద కోట్ల డాలర్ల(రూ. 6 వేల కోట్లు)ఇంధన రాయితీని కూడా ప్రకటించింది. తాజా పరిస్థితిపై ఉక్రెయిన్ నేతలతో చ ర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ మంగళవారం కీవ్ చేరుకున్నారు.
 
 మరోపక్క.. ఉక్రెయిన్ సరిహద్దులో కవాతు చేస్తున్న తమ 1.50 లక్షల మంది సైనికులను తిరిగి స్థావరాలకు చేరుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించా రు. అయితే ఉక్రెయిన్‌లోని రష్యన్ జాతీయులను కాపాడుకోవడానికి సైన్యాన్ని వాడే హక్కు తమకున్నదని, కానీ ఆ అవసరం రాకూడదని ఆశిస్తున్నానన్నారు. పరారీలో ఉన్న యానుకోవిచే ఆ దేశానికి నిజమైన అధ్యక్షుడని పునరుద్ఘాటించారు. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌లో రాజ్యాంగ విరుద్ధ తిరుగుబాటుకు ఊతమిస్తూ, ఆ దేశాన్ని అరాచకం దిశగా తీసుకెళ్తున్నాయని దుయ్యబట్టారు. తమపై పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తే అవి వాటికే బెడిసికొడతాయన్నారు.
 
 రష్యాది చారిత్రక తప్పిదం: ఒబామా
 ఉక్రెయిన్‌పైకి రష్యా దండెత్తి చారిత్రక తప్పిదం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆరోపించారు. వెంటనే వెనక్కి తగ్గకపోతే రష్యాను శిక్షించేందుకు దౌత్య, ఆర్థిక చర్యలు చేపట్టే అవకాశాలను పరిశీలిస్తున్నానన్నారు. ఉక్రెయిన్ల భవితను వారే నిర్ణయించుకోవాలన్నది తమ అభిమతమన్నారు. ఉక్రెయిన్‌కు ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు వందకోట్ల డాల్లర్ల రాయితీ ప్యాకేజీకి ఆయన ఆమోదం తెలిపారు. దీంతోపాటు ఆర్థిక, ఎన్నికల సంస్థలకు శిక్షణలో సాయం చేయనున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది.
 
 క్రిమియాలో ఉద్రిక్తత
 ఉక్రెయిన్‌లోని స్వయంప్రతిపత్తి ప్రాంతమైన క్రిమియాలోని రష్యా అనుకూల సైనికులు మంగళవారం బెల్బెక్ వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమ ఉద్యోగాలు తమికివ్వాలని అక్కడ పనిచేసిన 300 మంది ఉక్రెయిన్  సైనికులు డిమాండ్ చేస్తూ ముందుకురాగా హెచ్చరికగా రష్యా జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. క్రిమియాలోని సెవస్తపోల్ రేవులో రెండు ఉక్రె యిన్ యుద్ధనౌకలను రష్యా నౌకలు దిగ్బంధించాయి.
 
 యానుకోవిచ్ కోరితేనే పంపాం: రష్యా
 క్రిమియాలో 16 వేల మంది రష్యా సైనికులు ఉన్నారని ఉక్రెయిన్ ప్రతినిధి ఐక్యరాజ్య సమితికి చెప్పగా, శాంతిభద్రతల కోసం వారిని అక్కడికి పంపాలని  యానుకోవిచ్ పుతిన్‌ను కోరడంతోనే మోహరించామని రష్యా చెప్పింది. అయితే పరారీ ఉన్న యానుకోవిచ్‌కు విదేశీ సాయం కోరే అధికారం లేదని ఉక్రెయిన్ ప్రతినిధి అన్నారు. సంక్షోభాన్ని నివారించకపోతే రష్యాపై దౌత్య, ఆర్థిక ఆంక్షలు విధిస్తామని, జీ-8 నుంచి తప్పిస్తామని యూరోపియన్ యూనియన్, కెనడా తదితర దేశాలు హెచ్చరించాయి. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా యూరో విలువ డాలర్‌తో పోలిస్తే 1.38 నుంచి 1.37కు పడిపోయింది.
 
 ‘మిజో విద్యార్థులకు భద్రత కల్పించండి’
 ఉక్రెయిన్‌లో చిక్కుకున్న దాదాపు 40 మంది మిజో విద్యార్థుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్‌హవ్లా భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి వయలార్ రవిలకు లేఖ రాశారు.
 

మరిన్ని వార్తలు