ఖమ్మం సరిహద్దుల్లో హైఅలర్ట్

27 Jul, 2015 20:46 IST|Sakshi

రేపటి నుంచి అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు
భారీగా చేరుకుంటున్న ప్రత్యేక బలగాలు
ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్


చర్ల (ఖమ్మం జిల్లా): ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలంటూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఖమ్మం జిల్లా ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రత్యేక బలగాలను తరలిస్తున్నారు. మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో సరిహద్దులోని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. ప్రధానంగా వెంకటాపురం సర్కిల్ పరిధిలోని చర్ల, దుమ్మగూడెం, వెంకటాపురం, వాజేడు, పేరూరు పోలీస్‌స్టేషన్లలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

సరిహద్దు ప్రాంతానికి వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరులు, మిలిటెంట్లు, మాజీ మిలిటెంట్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని మావోల కదలికలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ప్రత్యేక పోలీసు బలగాలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బలగాలను కలుపుకొని జాయింట్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో అధికార పార్టీనేతలతో పాటు, ప్రధాన పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను పోలీసులు అప్రమత్తం చేశారు. మావోయిస్టు టార్గెట్లుగా ఉన్న వారిని తక్షణమే స్వగ్రామాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు మకాం మార్చాలంటూ సూచనలు చేశారు.

మరిన్ని వార్తలు