బోస్... అంతుచిక్కని రహస్యం!

22 Sep, 2015 00:31 IST|Sakshi
బోస్... అంతుచిక్కని రహస్యం!

లక్నో: భారత స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్, స్వాతంత్య్రానంతరం ఎక్కడున్నారు ? ఆయన తన జీవిత చరమాంకంలో ఎక్కడ గడిపారు, ఎలా గడిపారు? అన్న అంశంపై పలు ఆసక్తికరమైన కథనాలు, ఊహాగానాలు నేటికి ప్రచారంలో ఉన్న విషయం తెల్సిందే.  ఆయన గుమ్నామీ బాబా అలియాస్ భగవాన్‌జీగా ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో గడిపారన్నది అందులో ఓ కథనం. గుమ్నామీ బాబా 1985, సెప్టెంబర్ 16వ తేదీన మరణించారు. ఆయనే మారువేషంలో ఉన్న సుభాస్ చంద్రబోస్ అని అప్పట్లో ‘నయా లోగ్’ అనే స్థానిక పత్రిక మొదటి పేజీలో ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.

అవును, ఆయన నేతాజీనేనంటూ బాబా అనుచరులు కూడా విస్తృత ప్రచారం చేశారు. ఎందుకంటే, గుమ్నామీ బాబా భక్తుల ముందుకుగానీ, అనుచరుల ముందుకుగానీ ఎప్పుడు వచ్చే వారు కాదు. తెర వెనక ఉండే మాట్లాడేవారు. పైగా ఆయన చనిపోయినప్పుడు ఆయన వద్ద నేతాజీ రాసిన కొన్ని పుస్తకాలు దొరికాయి.ఈ ప్రచారాన్ని దాదాపు మూడు దశాబ్దాల పాటు, అంటే,  2006 సంవత్సరం వరకు కూడా ప్రజలు నమ్ముతూ వచ్చారు. ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని, ఇది పూర్తిగా అబద్ధమని 2006లో జస్టిస్ ముఖర్జీ కమిషన్ తేల్చింది. కమిషన్ కావాలనే అలా తేల్చిందంటూ ఆ ప్రచారాన్ని ఇప్పటికీ నమ్ముతున్న వాళ్లు ఉన్నారు.

జర్నలిస్టులు రామ్‌తీర్థ్ వికల్, చంద్రేశ్ కుమార్ శ్రీవాత్సవ్‌లు 1985, అక్టోబర్ 28వ తేదీన ఆ కథనాన్ని రాశారు. ‘ఫైజాబాద్ మే అజ్ఞాత్‌వాస్ కర్ రహే సుభాస్ చంద్రబోస్ నహీ రహే’ శీర్షికతో ఆ వార్తను అశోక్ టాండన్ సంపాదకత్వంలో ‘నయా లోగ్’ పత్రిక ప్రచురించింది. బోస్ 12 సంవత్సరాల పాటు ఫైజాబాద్‌లో అజ్ఞాతవాసంలో బతికారని, చివరకు సెప్టెంబర్ 16వ తేదీన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని మొదటి పేరాలో పేర్కొన్నారు. అప్పుడు ఈ వార్త సంచలనం సృష్టించింది. అయితే తన వార్తా కథనానికి ఎలాంటి ఆధారాలను చూపలేకపోయింది. బాబా అనుచరుల కథనం ప్రకారం అని మాత్రమే పేర్కొంది. అప్పుడు ఈ కథనాన్ని పోటీ పత్రిక ‘జన్‌మోర్చా’ ఖండించింది.

అప్పుడు రెండు పత్రికల్లో మధ్య బాబానే బోస్ అంటూ, కాదంటూ పోటాపోటీ వరుస కథనాలు వెలువడ్డాయి. నయా లోగ్ వార్తా కథనం తప్పని రుజువు చేయడం కోసం జన్‌మోర్చా పత్రిక బోస్ బంధు, మిత్రుల ఇంటర్వ్యూలను కూడా ప్రచురించింది. కుటుంబ సభ్యుల నుంచే కాకుండా దేశంలోని పలు వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు కేంద్ర ప్రభుత్వం 1999లో బోస్ మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరపడానికి జస్టిస్ ముఖర్జీ కమిషన్‌ను నియమించింది. నయాలోగ్ కథనంలో వాస్తవం ఎంతుందో తెలుసుకునేందుకు జస్టిస్ ముఖర్జీ కమిషన్ ఇటు గుమ్నామీ బాబా చేతిరాత ప్రతులను, అటు బోస్ చేతిరాత ప్రతులను సేకరించి సిమ్లా, కోల్‌కతాలోని సెంట్రల్ ఫోరెన్సిన్ సైన్స్ లాబరేటరీలకు పంపించింది.

అలాగే చేతిరాత నిపుణుడు బీ లాల్ వద్దకూ పంపించింది. రెండు రాత ప్రతులకు మధ్య ఎలాంటి సామీప్యత లేదని ఆ పరీక్షల్లో తేలిపోయింది. అయినప్పటికీ మరింత రూఢీ చేసుకునేందుకు గుమ్నామీ బాబా పంటి నుంచి డీఎన్‌ఏను సేకరించి, బోస్ తండ్రివైపు, తల్లివైపు వారి నుంచి రక్తాన్ని సేకరించి డీఎన్‌ఏ పరీక్షలు జరిపారు. ఆ పరీక్షల్లో కూడా గుమ్నామీ బాబా, బోస్ ఒక్కరు కాదని తేలిపోయింది. జన్‌మోర్చా నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకే నయాలోగ్ పత్రిక ఇలాంటి ప్రచారాన్ని తీసుకొచ్చిందనే విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఈ కథనాన్ని ఇప్పటికీ నమ్ముతున్న వాళ్లు ఉండడం గమనార్హం. మమతా బెనర్జీ బోస్ కు సంబంధించిన కొన్ని రహస్య ఫైళ్లని బయటపెట్టనప్పటికి ఆయన అదృశ్యం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది.

మరిన్ని వార్తలు