దినేష్‌రెడ్డికి మళ్లీ చుక్కెదురు!

30 Sep, 2013 06:49 IST|Sakshi
దినేష్‌రెడ్డికి మళ్లీ చుక్కెదురు!

డీజీపీగా కొనసాగించాలన్న పిటిషన్‌ ను కొట్టివేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డికి హైకోర్టులోనూ చుక్కెదురైంది. 2014 డిసెంబర్‌ వరకూ తనను డీజీపీగా కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దినేష్‌రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దినేష్‌రెడ్డి పదవీ కాలం పూర్తయినందున డీజీపీగా ఆయనను కొనసాగించలేమంటూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ (క్యాట్‌) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. నిబంధనల ప్రకారం మరోసారి దినేష్‌రెడ్డి పదవీ కాలం పొడిగింపు సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ అశుతోష్‌ మొహుంతా, జస్టిస్‌ దామా శేషాద్రినాయుడులతో కూడిన ధర్మాసనం ఆదివారం సాయంత్రం తీర్పు వెలువరించింది. డీజీపీగా పొడిగింపు సాధ్యం కాదంటూ క్యాట్‌ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ దినేష్‌రెడ్డి శనివారం అత్యవసరంగా హౌస్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఆదివారం ఉదయం జస్టిస్‌ మొహుంతా తన నివాసం వద్దే వాదనలు విన్నారు.

దినేష్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదన వినిపిస్తూ.. పదవీ విరమణ గడువుతో సంబంధం లేకుండా.. వచ్చే ఏడాది చివరి వరకూ దినేష్‌రెడ్డికి డీజీపీగా కొనసాగే అర్హత ఉందన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి తోసిపుచ్చారు. దినేష్‌రెడ్డి తొలు త 2011 జూన్‌ 30న డీజీపీగా నియమితులయ్యారని, ప్రకాశ్‌సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2012 సెప్టెంబర్‌ 29న యూపీఎస్‌సీ సూచనల ప్రకారం ఆయనను డీజీపీగా మరోసారి ప్రభుత్వం నియమించిందన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30తో పదవీ కాలం పూర్తయిందని తెలిపారు. నిబంధనల ప్రకారం పదవీ విరమణ చేసిన వ్యక్తికి ఎటువంటి పొడిగింపునివ్వరాదన్నారు.

దినేష్‌రెడ్డి పదవీ విరమణను ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసిందని, దానిని దినేష్‌రెడ్డి సవాలు చేయలేదని నివేదించారు. వాస్తవానికి క్యాట్‌ మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టుకు రావడానికి వీల్లేదన్నారు. కేంద్ర హోంశాఖ తరఫున అదనపు అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ సమీర్‌కుమార్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, డీజీపీ ఆస్తులపై వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని పొడిగించలేమన్నారు. వాదనలు విన్న ధర్మాసనం సాయంత్రం 5.20కి తీర్పు వెలువరిస్తూ దినేష్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

తాత్కాలిక డీజీపీగా ప్రసాదరావు?
 సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర తాత్కాలిక డెరైక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు(డీజీపీ)గా బయ్యవరపు ప్రసాదరావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుత డీజీపీ దినేష్‌రెడ్డి పదవీకాలం సోమవారంతో ముగియనుంది. తన పదవీకాలాన్ని పొడిగించాల్సిందిగా దినేష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో కొత్త డీజీపీ నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు తాత్కాలికంగా ప్రసాదరావును డీజీపీగా నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం. డీజీపీ నియామకంపై కసరత్తు కొలిక్కి వచ్చాక.. అర్హులైన ఐదుగురు పోలీసు ఉన్నతాధికారుల పేర్లను యూపీఎస్సీకి ప్రభుత్వం పంపనుంది. వీరిలో ముగ్గురి పేర్లను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తుంది. ఆ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తికాల డీజీపీగా నియమిస్తుంది. ఈ పక్రియకు వారం రోజులు పట్టే అవకాశం ఉండటంతో.. తాత్కాలిక డీజీపీగా ప్రసాదరావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు