జరిమానా నిబంధన అమలు చేయాల్సిందే

22 Sep, 2015 02:29 IST|Sakshi
జరిమానా నిబంధన అమలు చేయాల్సిందే

* హెల్మెట్ వినియోగంపై ప్రభుత్వానికి స్పష్టంచేసిన హైకోర్టు
* ఇప్పటి వరకు ఎందరికి రూ100, రూ.300 జరిమానా విధించారని ప్రశ్న
* పూర్తి వివరాలతో నివేదికను కోర్టు ముందుంచాలని ఆదేశం

 
 సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ వాడకంలో ఉల్లంఘనలకు పాల్పడేవారికి నిబంధనల మేరకు జరిమానా విధించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. మొదటిసారి హెల్మెట్ ధరించకపోతే రూ.100, రెండోసారి నుంచి హెల్మెట్ ఉపయోగించని ప్రతీసారి రూ.300 జరిమానా విధించాలన్న చట్ట నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టంచేసింది. అప్పుడే హెల్మెట్‌ను వాహనదారులంతా ధరిస్తార ని పేర్కొంది. ఇప్పటివరకు ఎంత మందికి రూ.100 జరిమానా విధించారు? ఎందరికి రూ.300 జరిమానా విధించారన్న వివరాలతో స్థాయీ నివేదిక (స్టేటస్ రిపోర్ట్)ను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
 
 జరిమానా ఎందుకు పెంచకూడదు?
 హెల్మెట్ ధరించే విషయంలో మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129 అమలుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ 2009లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉడతనేని రామారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. విచారణ ప్రారంభంగా కాగానే ధర్మాసనం స్పందిస్తూ.. హెల్మెట్ ధరించని వాహనదారులు ఎంతో మందిని చూస్తున్నామని, దీనిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వం తరఫు ప్రత్యేక న్యాయవాది అండపల్లి సంజీవ్‌కుమార్‌ను ప్రశ్నించింది.
 
 ఇందుకు ఆయన బదులిస్తూ.. ఉన్నతస్థాయిలో సమావేశం జరిగిందని, హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయించారని తెలిపారు. ఇందుకు ధర్మాసనం.. నిర్ణయాలు, నిబంధనలను కాగితాలకే పరిమితం చేయవద్దని, ఆచరణలో చేసి చూపాలంది. గత పక్షం రోజుల్లో పది వేల మందిపై కేసులు నమోదు చేశామని సంజీవ్ చెప్పగా.. ఎంత మొత్తం జరిమానాగా విధించారని ధర్మాసనం ప్రశ్నించింది. చట్ట నిబంధనల మేరకు ఒక్కొక్కరికి రూ.100 విధించామని చెప్పగా.. ఆ మొత్తాన్ని ఎందుకు పెంచకూడదని   ప్రశ్నించింది. జరిమానా మొత్తాల పెంపు కేంద్రం పరిధిలోనిదని సంజీవ్ చెప్పారు. జరిమానా భారీగా ఉండాలని, హెల్మెట్ ధరతో సమానమైన మొత్తాన్ని జరిమానాగా విధిస్తే అందరూ హెల్మెట్ వాడతారని ధర్మాసనం తెలిపింది. ఇప్పటి వరకు  ఎంత మందికి జరిమానా విధించారో పూర్తి వివరాలను తెలపాలని పేర్కొంది. హెల్మెట్ తప్పనిసరి వినియోగానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ  నివేదికను సమర్పించాలంది.
 

మరిన్ని వార్తలు