కాల్‌డేటాపై హైకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

29 Jul, 2015 00:29 IST|Sakshi

విజయవాడ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్లు
తదుపరి విచారణను నిలుపుదల చేయాలని అభ్యర్థన

 
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాల్‌డేటా ఇవ్వాలని సెల్యులార్ ఆపరేటర్లను ఆదేశిస్తూ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (సీఎంఎం) జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించింది. ట్యాపింగ్ వ్యవహారంపై విజయవాడ కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా మంగళవారం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, టెలికం మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఏపీ సిట్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, ఐడియా, రిలయన్స్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 25 ఫోన్ నంబర్ల కాల్ డేటాను, అందుకు సంబంధించిన లేఖలను ఇవ్వాలంటూ విజయవాడ కోర్టు జారీ చేసిన ఆదేశాలు ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం-1885లోని సెక్షన్ 5(2)కు విరుద్ధమని అజయ్‌మిశ్రా తన పిటిషన్లలో పేర్కొన్నారు. విజ యవాడ కోర్టు తన పరిధిని దాటి ఈ ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం కింద సెల్యులార్ ఆపరేటర్ల నుంచి కావాల్సిన సమాచారాన్ని కోరే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. దర్యాప్తు సంస్థలు కాటా డేటా వివరాలను కోరినప్పుడు వాటిని అందజేయాలని, అదే సమయంలో ఆ డేటాను సెల్యులార్ ఆపరేటర్లు తమ వద్ద ఉంచుకోరాదని, ఇదే విషయాన్ని కేంద్ర టెలి కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఈ నెల 13న సెల్యులార్ ఆపరేటర్లకు స్పష్టం చేసిందన్నారు.

ఈ విషయాన్ని వారు విజయవాడ కోర్టుకు చెప్పినా ప్రయోజనం లేకపోయిందని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం తమ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్‌ఐబీ) ఐజీపీ తదితరులు కోరిన వివరాలను ఇవ్వాలని సెల్యులార్ ఆపరేటర్లను ఆదేశించిందన్నారు. ఇదిలా ఉంటే విజయవాడ కోర్టు ఆదేశాలపై సెల్యులార్ ఆపరేటర్లు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ప్రాథమిక దశలోనే వారు తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఈ సమయంలో ఈ వ్యవహారంలో తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని భావించిన వారు హైకోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. టెలిగ్రాఫ్ చట్టం కింద కోరిన వివరాలను ఇవ్వాలన్న విజయవాడ కోర్టు ఆదేశాలు చట్ట విరుద్ధమని అన్నారు.  కాబట్టి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని అజయ్‌మిశ్రా హైకోర్టును కోరారు.
 
 

మరిన్ని వార్తలు