గణేశ్ మండపాలపై కఠిన ఆంక్షలు

15 Sep, 2015 18:46 IST|Sakshi
గణేశ్ మండపాలపై కఠిన ఆంక్షలు

వినాయక చవితి సందర్భంగా అనుమతి లేకుండా మండపాలు పెట్టినా, నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యం సృష్టించినా కోర్టు ధిక్కార నోటీసులు జారీచస్తామని బాంబే హైకోర్టు హెచ్చరించింది. ఈ ఉత్సవాల్లో పెద్ద తలకాయలు ఉంటాయి కాబట్టి, మునిసిపల్ కార్పొరేషన్ వాళ్లను ఏమీ అనలేని పరిస్థితి ఉంటుందని, నాయకులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. మండపాలు ఏర్పాటుచేసే ముందే అనుమతులు కచ్చితంగా తీసుకోవాలని స్పష్టం చేసింది.

రోడ్ల మీద అక్రమంగా మండపాలు ఏర్పాటు చేయడం, విపరీతంగా శబ్దకాలుష్యం సృష్టించడంపై దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాల విచారణ సందర్భంగా జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ వీఎల్ అచ్లియాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వినాయకచవితితో పాటు దహీ హండీ ఉత్సవం సందర్భంగా ఎక్కడపడితే అక్కడే మండపాలు పెడుతున్నారని, నిబంధనలను అతిక్రమిస్తున్నారని, అయినా కార్పొరేషన్ మాత్రం దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాది సంజీవ్ గోర్వాడ్కర్ కోర్టుకు తెలిపారు.

మామూలు మండపాల కంటే, శివసేన, కాంగ్రెస్, ఎంఎన్ఎస్ లాంటి పార్టీలు పెడుతున్న మండపాల్లో శబ్దాలు నిర్ధారిత స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని కోర్టు తెలిపింది.

మరిన్ని వార్తలు