ఆర్థిక క్రమశిక్షణలో రాజీలేదు

12 Dec, 2013 01:00 IST|Sakshi
ఆర్థిక క్రమశిక్షణలో రాజీలేదు

న్యూఢిల్లీ: ఆర్థిక క్రమశిక్షణ విషయంలో తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోదని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటం, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూడటంతో ప్రభుత్వ వ్యయం ఎగబాకే అవకాశం ఉందని... దీంతో ద్రవ్యలోటు లక్ష్యం సాధ్యం కాకపోవచ్చనే ఆందోళనల నేపథ్యంలో విత్తమంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైనప్పటికీ... ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉంటామని చిదంబరం చెప్పారు. బుధవారం ఇక్కడ ఢిల్లీ ఆర్థిక సదస్సు-2013ను ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
 ధరలే కొంపముంచాయ్...
 నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో(మధ్యప్రదేశ్, రాజస్థాన్,ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ) కాంగ్రెస్ ఓటమికి అధిక ధరలూ ఒక కారణమేనని చిదంబరం వ్యాఖ్యానించారు. అయితే, ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడం కోసం వ్యవసాయోత్తులకు మద్దతు ధర తగ్గించడం, జాతీయ ఉపాధి హామీ పథకంలో కార్మికుల వేతలనాల్లో కోత వంటి చర్యలేవీ చేపట్టబోమన్నారు. దీనికి కళ్లెం వేయడం తమ ప్రధాన కర్తవ్యాల్లో ఒకటని కూడా ఆయన నొక్కిచెప్పారు. అక్రమ నిల్వలను అరికట్టడంలో రాష్ట్రాలు విఫలంకావడమే ధరలు ఎగబాకడానికి కారణమని  ఆర్థిక మంత్రి విమర్శించారు. అధిక ద్రవ్యోల్బణానికి మూల్యాన్ని మాత్రం కేంద్రం చెల్లించాల్సి వస్తోందన్నారు.
 
 ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధిస్తాం...
 ప్రభుత్వ ఎజెండాలో తొలి ప్రాధాన్యంగా ఆర్థిక స్థిరీకరణ ఉంటుందని, ద్రవ్యలోటుకు కచ్చితంగా కళ్లెం వేస్తామన్నారు.  ప్రస్తుత 2013-14 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 4.8 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకున్న సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థను భవిష్యత్తులో కొంతపుంతలు తొక్కించాలంటే క్రమంతప్పకుండా ఆర్థిక సంస్కరణలను దీర్ఘకాలం కొనసాగించాల్సిందేనని విత్తమంత్రి పేర్కొన్నారు. వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ), ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ), బీమా చట్టాల సవరణ బిల్లు, ఇండియన్ ఫైనాన్షియల్ కోడ్ వంటి సంస్కరణలు దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయడం(గేమ్ ఛేంజర్స్)లో కీలకంగా నిలుస్తాయని కూడా చిదంబరం పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు