ఉన్నత విద్యాభివృద్ధికి ‘రూసా’ సాయం

1 Dec, 2013 01:43 IST|Sakshi
ఉన్నత విద్యాభివృద్ధికి ‘రూసా’ సాయం

వీసీల సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) పథకం అమలుపై వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల సమావేశం శనివారం జరిగింది. సమావేశంలో పథకం అమలుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన మార్గదర్శకాలను విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి వివరించారు. యూనివర్సిటీలు తమ ప్రతిపాదనలకు సంబంధించి అనుమానాలు ఉంటే డిసెంబర్ 13న జరిగే సమావేశంలో నివృత్తి చేసుకుని డిసెంబర్ 20లోపు సమర్పించాలని ఉపకులపతులను కోరారు. 

 

వాటిని క్రోడీకరించి రాష్ట్ర సమగ్ర నివేదికను జనవరి 10లోగా కేంద్రానికి సమర్పిస్తామన్నారు. ఫిబ్రవరి 28 లోగా రాష్ట్ర ప్రతిపాదనలు ఆమోదం పొందితే.. ఏప్రిల్ 15 నాటికి కేంద్రం నిధులు విడుదల చేస్తుందని వివరించారు. అనంతరం రాష్ట్ర వాటా ఏప్రిల్ 30లోగా విడుదల చేయాల్సి ఉంటుందని తెలిపారు. రూసా పథకంలో చేపట్టే పనుల్లో..  18 అంశాల్లో పనులకు సంబంధించి నిధుల కేటాయింపు,  500లకు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో పెంపునకు నిధుల ఖర్చు, 12బీ, 2ఎఫ్ గుర్తింపు కలిగి ఉన్న, లేకున్నా రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కళాశాలల అభివృద్ధి, ఎయిడెడ్ కళాశాలలకు మౌలిక వసతులు కల్పన వంటి కార్యక్రమాలు ఉన్నాయి.

 

అంతేగాక అటానమస్ కళాశాలలను వర్శిటీలుగా అప్‌గ్రేడ్ చేయడం, క్లస్టర్ కళాశాలలను కలుపుతూ వర్శిటీల ఏర్పాటు, మౌలిక వసతుల కోసం ఒక్కో వర్శిటీకి రూ. 20 కోట్లు కేటాయించడం, మోడల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేయడం, ప్రస్తుతమున్న డిగ్రీ కళాశాలలను మోడల్ డిగ్రీ కళాశాలలుగా అభివృద్ధిపరచడం, పదేళ్ల కాలంలో 40 అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు, తదితర అంశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ పథకం కింద వచ్చే మూడేళ్లలో రాష్ట్రానికి రూ. వెయ్యికోట్లకు పైగా నిధులు దక్కనున్నాయి. ఈ సమావేశంలో ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, సాంకేతిక విద్య కమిషనర్ అజయ్ జైన్, మాధ్యమిక విద్య కమిషనర్ అదర్‌సిన్హా, ఉన్నత విద్య ప్రత్యేక కార్యదర్శి ఆర్.ఎం.డోబ్రియాల్, మండలి వైస్ చైర్మన్ విజయ్‌ప్రకాశ్, కార్యదర్శి సతీష్‌రెడ్డి, అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు