మురికి రాష్ట్రం మనదే..

17 Sep, 2013 03:23 IST|Sakshi

 టాప్-10 మురికివాడల నగరాల్లో 3 మనవే
నగరాలను అద్భుతంగా అభివృద్ధి చేశామన్నది అంతా భ్రమే
ప్రతి వంద మందిలో 31 నుంచి 44 మంది స్లమ్స్‌లోనే
 మురికివాడలు లేని రాష్ట్రంగా కేరళ

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నగరాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని చెబుతున్నదంతా ఉత్త కబుర్లేనని తేలిపోయింది. మురికివాడలు అధికంగా ఉన్నాయని కేంద్రం గుర్తించిన పది నగరాల్లో మూడు మన రాష్ట్రంలోనే ఉండటమే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో పది లక్షలు జనాభా దాటిన మూడు నగరాలు మురికివాడలకు ఆలవాలంగా మారాయి. కేంద్ర జనాభా లెక్కల డెరైక్టర్ జనరల్ గణాంకాల ఆధారంగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం పెరుగుతున్న నగరాలు, అక్కడి ప్రజలకున్న సౌకర్యాలపై నివేదిక రూపొందించింది. మురికివాడలు ఉన్న పట్టణాల్లో గ్రేటర్ విశాఖపట్టణం అగ్రస్థానంలో ఉండగా, విజయవాడ నాలుగో స్థానంలో, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.
 
  కేరళ రాష్ట్రం దాదాపు మురికివాడలు లేని రాష్ట్రంగా తేలింది. కార్పొరేషన్ల పరంగా చూసినా, రాష్ట్రపరంగా చూసినా మురికివాడలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండడం గమనార్హం. ప్రతీ వంద మందిలో 35 నుంచి 45 మంది మురికివాడల్లోనే నివసిస్తున్నారని ఆ నివేదిక స్పష్టం చేసింది. గ్రేటర్ విశాఖపట్టణంలో 45 శాతం కుటుంబాలు, విజయవాడలో 40 శాతం, గ్రేటర్ హైదరాబాద్‌లో 31 శాతం కుటుంబాలు మురికివాడల్లో ఉన్నాయని వివరించింది. నగరాల్లో 1.37 కోటి కుటుంబాలు మురికివాడల్లోనే జీవనం సాగిస్తున్నాయి. అందులో పదిలక్షల జనాభా దాటిన నగరాల్లో 52 లక్షల కుటుంబాలు ఉన్నాయని తెలిపింది. మిగిలిన పట్టణాల్లో మరో 85 లక్షల కుటుంబాలు ఉన్నాయని వివరించింది.
 
 తగ్గుతున్న ఉమ్మడి కుటుంబాలు
 దేశ వ్యాప్తంగా నగరాల్లో మురికివాడల సంఖ్య పెరుగుతుండడంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నివేదికలో ఆందోళన వ్యక్తమైంది. దేశవ్యాప్తంగా 7,933 నగరాలు, పట్టణాలు ఉన్నాయి. గడిచిన పదేళ్లలో 2,700 పట్టణాలు కొత్తగా ఏర్పడినట్లు ఆ నివేదిక పేర్కొంది. అదే సమయంలో పది లక్షల పైబడి జనాభా ఉన్న నగరాల సంఖ్య 35 నుంచి 53కి పెరిగినట్లు వివరించింది. నగరీకరణ పెరుగుతున్న కొద్దీ ఉమ్మడి కుటుంబాలు తగ్గుతున్నాయని వెల్లడించింది. ఒక కుటుంబంలో నలుగురికి  మించి ఉన్న వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. 2001 జనాభా లెక్కల్లో ఉమ్మడి కుటుంబం (9+)ఉన్న వారి శాతం 9.3 ఉంటే... 2011 జనాభా లెక్కలకు వచ్చేసరికి 5.5 శాతానికి తగ్గినట్లు తేల్చారు. తామిద్దరు, తమకు ఇద్దరు అన్న నినాదాన్ని నగరాల ప్రజలు వంటిపట్టించుకున్నట్లు ఈ లెక్కలు చెబుతున్నాయి. 2001లో నలుగురున్న కుటుంబాలు 22.4 శాతం ఉంటే... ప్రస్తుతం ఆ శాతం 26.4 శాతానికి పెరిగిందని వివరించింది. అదే సమయంలో ఆరు నుంచి ఎనిమిది మంది ఉంటే కుటుంబాలు 24.4 శాతం నుంచి 20.6 శాతానికి తగ్గిపోవడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు