ట్రంప్, హిల్లరీలు హోరాహోరీ..

16 Sep, 2016 10:57 IST|Sakshi

అమెరికా అధ్యక్షపదవి ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ల పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ల మధ్య పోటీ నువ్వా.. నేనా అన్నట్లుగా సాగుతోంది. గురువారం ఫాక్స్ న్యూస్ విడుదల చేసిన వివరాల ప్రకారం రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ఒక శాతం ఓట్ల మెజారిటీతో ముందంజలోఉన్నట్లు పేర్కొంది. నెల క్రితం వరకు దాదాపు ఎనిమిది శాతం ఓట్ల మెజారిటీతో ముందున్న హిల్లరీ, ట్రంప్ ల మధ్య తేడా ఒక్కసారిగా 1.5 శాతానికి పడిపోయింది.

9/11వార్షిక సమావేశంలో క్లింటన్ అస్వస్ధతకు గురైన తర్వాత అమెరికాలో జరిగిన మొదటి ఎన్నిక ఇదే. ఈ సమావేశానికి ముందు వరకు ట్రంప్ కంటే ఎనిమిది శాతం మెజారిటీ ఓట్లతో హిల్లరీ ముందంజలో ఉండటం గమనార్హం. దీంతో అధ్యక్షపదవి ఎవరికి దక్కుతుందో రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. హిల్లరీ ఆరోగ్య పరిస్ధితిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఫలించినట్లు ఈ ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయి.

ట్రంప్, ఆయన తరఫున కార్యకర్తలు పదేపదే హిల్లరీ ఆరోగ్యంపై అనుమానాలను రేకితిస్తూ చేసిన ప్రసంగాలు ఫలించాయి. హిల్లరీ ఆరోగ్యంపై ఆమె డాక్టర్ మరిన్ని వివరాలను వెల్లడించడం కూడా కొంతమేరకు ప్రతికూలతను చూపినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం హిల్లరీ 45శాతం ఓట్లతో ఉండగా.. ట్రంప్ 46 శాతం ఓట్లతో లీడ్ లో ఉన్నారు. కాగా ఈ నెల 26న మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరగనుంది.

మరిన్ని వార్తలు