-

‘తలైవా’ వస్తున్నారు!

19 Jun, 2017 19:58 IST|Sakshi
‘తలైవా’ వస్తున్నారు!

- ఇక రాజకీయంగా ఇక, అడుగులు
- త్వరలో అధికారిక ప్రకటన: అర్జున్‌ సంపత్‌ వ్యాఖ్య
- రజనీతో భేటీ


సాక్షి, చెన్నై: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ అరంగ్రేటంపై తమిళనాట చర్చ ఊపందుకుని ఉన్న విషయం తెలిసిందే. రజనీ రాజకీయంగా అడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా ‘కాలా’ సినిమా షూటింగ్‌ నుంచి కాస్త విరామం దొరకడంతో తలైవా మళ్లీ రాజకీయ అంశాలపై దృష్టి కేంద్రీకరించారని తెలుస్తోంది. ఇందుకు అద్దంపట్టే విధంగా ఆదివారం అన్నదాతలతో భేటీ అయ్యారు. సోమవారం రజనీ హిందూ మక్కల్‌ కట్చి నేతలతో భేటీ అయ్యారు.

మార్పు తలైవాతోనే సాధ్యం!
రజనీ రాజకీయ అరంగ్రేటానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారి నోళ్లకు తాళం వేసేవిధంగా హిందూ మక్కల్‌ కట్చి నేతలు గళం విప్పారు. రజనీకి భద్రత కల్పించాలంటూ డీజీపీకి విజ్ఞప్తి  చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం హిందూ మక్కల్‌ కట్చి నేత అర్జున్‌ సంపత్‌కు రజనీకాంత్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. సోమవారం ఉదయం 11 గంటలకు హిందూ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు అర్జున్‌ సంపత్, ప్రధాన కార్యదర్శి రామ్‌ రవికుమార్, యువజన ప్రధాన కార్యదర్శి గురుమూర్తితో పాటుగా పలువురు పోయెస్‌ గార్డెన్‌కు వెళ్లి.. రజనీకాంత్‌ను కలిశారు. రాజకీయాల్లోకి రావాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు తలైవా తనదైన స్టైల్లో చిరునవ్వుతో సమాధానం ఇచ్చినట్టు హిందూ మక్కల్‌ కట్చి వర్గాలు తెలిపాయి.

ఈ భేటీ అనంతరం మీడియాతో అర్జున్‌ సంపత్‌ మాట్లాడుతూ, ‘తలైవా వస్తారు.. రావడం తథ్యం. త్వరలో అధికారిక ప్రకటన’ అని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆయన సిద్ధం అవుతున్నారని, మార్పు తలైవాతోనే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. కొత్త పార్టీని ప్రకటించే కసరత్తుల్లో ఉన్నట్టున్నారని, రాజకీయంగా సింహం.. సింగిల్‌గా ప్రభంజనం సృష్టించడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. డిసెంబర్‌ 12న కొత్తపార్టీ ప్రకటిస్తారా? అని ప్రశ్నించగా చిరునవ్వుతో రజనీ సమాధానం ఇచ్చారని తెలిపారు. తమ మద్దతు రజనీకి ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. అయితే, ఈ భేటీలో ఎలాంటి రాజకీయం లేదని, వాళ్లంతట వాళ్లే వచ్చి రజనీతో మర్యాదపూర్వకంగా కలిశారని తలైవా సన్నిహితులు పేర్కొనడం గమనార్హం.

మరిన్ని వార్తలు