పళ్లను ముఖంలోకి దించి.. ఈడ్చుకెళ్లింది..

28 Jun, 2016 13:17 IST|Sakshi
పళ్లను ముఖంలోకి దించి.. ఈడ్చుకెళ్లింది..
జోహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాలోని ప్రముఖ క్రూగర్ జాతీయ పార్కులో సోమవారం దారుణం చోటు చేసుకుంది. కుటుంబంతో పాటు విహారయాత్రకు వచ్చిన ఓ బాలుడిపై హైనా దాడి చేసింది. దీంతో అతని ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. సోమవారం ఓ కుటుంబం విహారయాత్రకు పార్కుకు వచ్చింది. మధ్యహ్న సమయంలో యాత్రికుల విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేసిన టెంట్లలోకి అందరూ వెళ్లారు.
 
ఎండకు అలసిపోయిన బాలుడు తన టెంటును మూసివేయకుండా ఆదమరచి నిద్రపోయాడు. జంతువులు ప్రవేశించడానికి లేకుండా ఏర్పాటు చేసిన కంచెలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా ఓ హైనా క్యాంప్ స్థలంలోకి ప్రవేశించింది. బాలుడు నిద్రిస్తున్న గుడారం పూర్తిగా మూసి ఉండకపోవడంతో లోపలికి ప్రవేశించింది. అతనిపై దాడి చేసిన హైనా, దాని ముందరి పళ్లతో బాలుడి ముఖంపై తీవ్రంగా దాడి చేసి బయటకు ఈడ్చుక్కెళ్లసాగింది.

ఈ సమయంలో బాలుడు బాధతో పెద్దగా కేకలు వేయడంతో ఉలిక్కిపడిన అతని కుటుంబసభ్యులు హైనా బారి నుంచి అతన్ని కాపాడారు. పార్కు గైడ్, నర్సు ఘటనాస్థలంలో అందుబాటులో ఉండటంతో ప్రాధమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. కాగా, గత ఏడాది జులైలో టూరిస్ట్ గైడ్ పై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని వార్తలు